సేవా ఇస్లాం ధర్మం విశ్వాసాల (అఖాయిద్) మీద, ఆరాధనల (ఇబాదాత్) మీద ఎక్కువ నొక్కు పెడుతుంది. ఎందుకంటే, మనిషి విశ్వాసం సరైనదై ఉండి, ఆరాధనల ధ్వారా దైవంతో తన సంబంధాన్ని బలపర్చుకుంటే ఆటోమెటిక్‌గా అతని ఆలో చన, ఆచరణ దిశ సయితం స్వమైన దిశలో పయనిస్తుంది. అతని జీవితం రుజుమార్గానికి నిలువుటద్దం అవుతుంది. విశ్వా సాలు, ఆరాధనల తర్వాత ఇస్లాం నైతికత మరియు శాసనాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. అది ఉన్నత నైతిక విలువలను బోధించింది. అది మనిషి కీర్తిప్రతిష్టల్ని, గౌరవమర్యాదల్ని ఉన్నత నైతిక ప్రమాణాలతో, ప్రవర్తనతో జోడిస్తుంది. అనైతికత, అశ్లీలత, అసభ్య ప్రవర్తన నుండి దూరంగా మసలుకోవాలని తాకీదు చేస్తుంది. యదార్థమేమిటంటేె, నైతిక పతనావస్థ అన్నది మనిషిని అటు ప్రభువు ప్రసన్నతకు, ఇటు ప్రజల ప్రేమకు దూరం చేస్తుంది. ఉత్తమ నైతిక ప్రమాణాల్ని పాటించడం ఒక్కటే మార్గం. అది వినా మార్గాంతరం లేదు. ఉన్నత నైతిక విలువల్లోని స్పష్టమైన కోణం సృష్టిరాసుల సేవ అన్నది. సృష్టిరాసుల సేవ అంటే, ముఖ్యంగా ప్రజల కష్టదుఖాల్లో, క్లిష్టతర ఘడియల్లో పాలుపంచుకోవడం. సేవా భావం సాటి ప్రజల యోగ క్షేమాల్ని తెలుసుకునేలా మనిషిని ప్రేరేపిస్తుంది. తద్వారా అతనికి శాంతి, మనఃసంతృప్తి ప్రాప్తమవుతుంది.
ఇస్లాం ప్రారంభం నుంచే దౌర్జన్యం, దుర్మార్గం, దాష్టికానికి, దమన నీతికి, పశువు ప్రవృత్తికి వ్యతిరేకంగా గళం విప్పింది. బలహీన ప్రజల, బడుగు వర్గాల, దళిత జనాల పక్షం వహించి ఎవరి హక్కులు వారికి అందే వాతావరణాన్ని కల్పించింది. ఎక్కడానూ, ఎప్పుడూను వారి హక్కులు స్వాహా కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. సర్వకాల సర్వావస్థల్లోను వారి హక్కులు వారికి అందేలా కట్టుదిట్టమైన చర్యలు, చట్టాలు ప్రవేశ పెట్టి, అందరూ ఆ శాసనానికి లోబడి ఉండేలా ప్రజల్ని తీర్చిదిద్దింది.
నేడు మానవ సేవ అనగానే క్రిస్టియన్ మిషనరీల భావం మెదడులో కదలాడుతుంది. నిజంగా ఇస్లాం ఈ విషయమై ఎంతో మహోన్నత సేవాభావాన్ని ప్రతిపాదించింది. అది వ్యక్తిని, సమాజాన్ని, రాజ్యాన్ని ఇందులో భాగస్వాముల్ని చేసింది. మానవ సేవా విషయమై అది ఎంత విస్తృతంగా చర్చించిందో, ఎలాంటి ప్రణాళికలను, శాసనాలను ప్రవేశపెట్టిందో అవి అద్వతీయమైనవి, అమోఘమైనవీను అనడంలో ఎలాటి సంశయం లేదు. ఇస్లాం బోధించే విలువల వెలుగులో మానవ సేవా దృక్కోణాలు ఏవైతే ముందుకు వస్తాయో అవి –
సేవ మానవ ప్రకృతి సిద్ధమైన భావం. ఒక పసికందుని సేవ తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఈ సహజ భావం కారణంగానే చేెస్తారు. దైవంతో దాసుని సంబంధం ఈ సహజ భావాన్ని బల పరుస్తుంది.
ప్రతి యుగంలోనూ దైవ ప్రవక్తలు, దైవ గ్రంథాలు సృష్టి సేవ గురించి ఆదేశించారు. ఈ విషయమై చిట్టచివరి దైవ గ్రంథం ఖుర్‌ఆన్ మరియు కట్టకడపటి దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ప్రత్యేకంగా నొక్కి వక్కాణించారు. సమాజంలో సేవా భావాన్ని పెంపొందించడమే కాక, దాన్ని దైవ సామీప్యాన్ని పొందే అతి పెద్ద సాధనంగా అభి వర్ణించారు.
ఇస్లాం సృష్టిరాసుల సేవను ఆరాధనగా పరగణిస్తుంది. పవిత్ర ఖుర్‌ఆన్, నమాజు మరియు జకాత్‌ను ఒకే చోట పేర్కొంటుంది. నమాజు ద్వారా మనిషి సంబంధం మాధవునితో డైరెక్ట్‌గా ఏర్పడు తుంది. జకాతు ద్వారా మనిషి బాంధవ్యం తోటి మనుషులతో బలపడుతుంది, ఆ విధంగా ఈ ఉభయ కోణాలూ ప్రధానమైనవే. మరో కోణం ఏమంటే, ధన పరమైన ఆరాధన దేహ పరమైన ఆరాధనకు బదులుగా ఖరారు చేయడం జరిగింది. కొన్ని సందర్భాలలో ఉపవాసానికి బదులు దానాధర్మాలు చేయమం టుంది ఇస్లాం.
ఇస్లాం కేవలం తనతో మత పరమైన సంబంధం గలవారి సేవ మాత్రమే చేయమని చెప్పదు. అది సమస్త జీవరాసుల పట్ల సత్సం బంధం , సేవాభావం కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తుంది.
ఇస్లాం ప్రజల్లో సేవా భావాన్ని ప్రేరేపించడంతో సరిపెట్టుకోదు. వారి సేవకు అర్హులు ఎవరు? వారిలో ప్రధములు ఎవరో కూడా తెలియజేస్తుంది. వారిలో తల్లిదండ్రులు, బంధుమిత్రులు లాంటి రక్త సంబంధీకులు కూడా ఉన్నారు. ఎలాంటి రక్త సంబంధం లేని అనాథలు, అగత్యపరులు, వికలాంగులు, వితంతవులు, ఇరుగు పొరుగువారు, బాటసారులు, బానిసలు, ఖైదీలు, అవసరార్థులు కూడా ఉన్నారు.
మనిషి అధిక శాతం అవసరాలు ధనంతోనేె ముడిపడి ఉంటా యన్నది వాస్తవం. కాబట్టి ధన సేవ ప్రాముఖ్యతను నిరాకరించ లేము. అయితే సేవ చేయడానికి ఇదొక్కటే మార్గం అనుకోవడం సరి కాదు. పవక్త (స) వారి ప్రవచనాల దృష్ట్యా – తన సోదరునితో నగుమోము సంభాషణ, సవారీపై కూర్చోవడంలో సహాయం చేెయడం, ఏదైనా సామాను ఉంటే ఎత్తి ఇవ్వడం, దారి నుండి హానికర వస్తువును తొలగించడం, దారి తెలియని వ్యక్తికి దారి చూపడం, ఒకరికి గిన్నెలో నీరు నింపి ఇవ్వడం, మంచిని ఆదేశిం చడం, చెడును వారించడం మొదలైనవన్నీ ధాన ధర్మాల క్రిందికే, సేవ క్రిందికే వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రతి మంచి కార్యం పుణ్యాన్నిస్తుంది, దానధర్మంగానే పరగణించబడుతుంది.
తాత్కాలికమైనది, తక్షణమైనది రెండు రకాల సేవ ఉంటుంది. ఉదాహరణకు- ఆకలిగొన్న వారికి అన్నదానం చేయడం, దప్పి గొంతుల దాహాన్ని తీర్చడం, కూడు లేని వారికి కూడు, గూడు లేని వారికి గూడు, గుడ్డలేని వారికి గుడ్డ సమకూర్చి ఇవ్వడం, రోగుల్ని వెళ్ళి పరామర్శించడం, వారిని అవసరమైన వైద్య సదుపాయాల్ని కలుగజేయడం మొదలైనవి. కొన్ని సందర్భాల్లోనయితే ఈ తాత్కాలిక, తక్షణ సేవ ప్రాముఖ్య మరింత అధికమైపోతుంది. అలాంటి విపత్కర సమయంలో నిర్ల క్ష్యం, సామాజిక స్పృహా లేమి అన్నది ఆ వ్యక్తిలోని నైతిక పతనావస్థకు తార్కాణం. ఇలాంటి సమ యాల్లో ప్రతి ఒక్కరూ స్పందించి తమవంతుగా సేవ అందించాలని ఇస్లాం వక్కాణిస్తుంది.
ఇస్లాం మనిషి ఎదుర్కునే సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపెడుతుంది. ఒక అగత్యపరుని, ఒక వితంతువు అవసరాన్ని తాత్కాలికంగా తీర్చడం కూడా పుణ్యకార్యమే. అయితే వారి పూర్తి పోషణా బాధ్యతను తన భుజాల మీద వేసుకోవడం దివారాత్రులు ప్రార్థన చేయడంతో, ఉపవాసాలు పాటించడంతో సమానం అంటుంది. అలాగే ప్రేమతో ఒక అనాథ తల నిమరడం గొప్ప పుణ్య కార్యమే కాక తద్వారా మనసు మెత్తబడుతుందంటుంది. అయితే అతని పూర్తి పోషణా బాధ్యత, విద్యా బాధ్యత, అతని నైతిక పర్య వేక్షణ స్వర్గంలో మహా ప్రవక్త ముహమ్మద్ (స) వారి సహచర్యానికి ముఖ్య సాధనం అంటుంది. అదే విధంగా అగత్యపరులను ఆదు కోవడమే కాక, వారి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఒక కొట్టు తెరిచి ఇవ్వడమో, ఒక పని నేర్పించడమో చేస్తే మరింత మంచి దంటుంది.
సేవ అనేక రకాలుగా చేయవచ్చు. ధన పరమైన సహాయం అదిం చడం, అప్పు ఇవ్వడం, అప్పు తీర్చే స్థితిలో ఆ వ్యక్తి లేకపోతే గడువు ఇవ్వడం, ఒక వస్తువును శాశ్వతంగా ఇచ్చివేయడం లేదా తాత్కాలి కంగానైనా ఇవ్వడం, అవసరం వచ్చినప్పుడు ఒకేలాంటి రెండు వస్తు వులు – సేద్యం కోసం రెండు ఎద్దులు, పాలు కోసం రెండు ఆవులు ఇవ్వడం, ఒకరితో కూలి కోసం పని చేయించుకోవడానికి బదులు బిజినెస్ పాట్నర్‌గా పెట్టుకోవడం, పొలంలో. పంటలో భాగస్వా మ్యం కల్పించటం, బాధిత ప్రజలను ఆర్థికంగా, నైతికంగా, రాజ కీయంగానూ ఆదుకోవడం మొదలైనవి ప్రవక్త (స) వారి హదీసుల ద్వారా రూఢి అవుతాయి.
పర్యావరణ పరిరక్షణా సేవ సయితం ఎంతో విస్తృతమైనది చెప్పొచ్చు. ఇలాంటి సేవా కార్యక్రమాల వల్ల సమాజానికి చాలా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇటువంటి సేవలు అటు ప్రభుత్వం, ప్రజలు, సంస్థలు-అందరూ చేస్తుంటారు. ఉదాహరణకు- శుచీశుభ్రత, రహదారుల నిర్మాణం, బస్సు సౌక ర్యం, విద్యుత్, నీటి సౌకర్యం, చెట్లు, మొక్కలు నాటడం, అడవుల ను రక్షించడం, బంజరు భూములను సాగుకు అనుకూలంగా తయారు చేయడం, పాఠ శాలలను, ప్రార్థనాలయాలను, అనా థాశ్రమాలను, వైద్య శాలలను నిర్మించడం మొదలైనవి. ఇస్లాం ఇటువంటి సామాజిక కార్యాల వైపు దృష్టి మళ్ళించడమే కాక, వాటి కోసం కొంత ధనాన్ని ప్రత్యేకించాలని ప్రేరేపిస్తుంది. అందు నిమిత్తం అవసరమైన కార్యప్రణాళికను ప్రజలకు ఇస్తుంది.
ఇస్లాం – సృష్టిరాసుల సేవ కోసం ఏకమవ్వాల్సిందిగా, సంస్థలు, ట్రస్టులు లాంటివి ఏర్పాటు చేయవలసిందిగా పురమాయిస్తుంది. ఈ నిమిత్తం ఎవరి సహాయం తీసుకోవడంలో ఎలాంటి అభ్యంత రం లేదంటుంది.
సేవా విషయమై ఇస్లాం ప్రత్యేకత ఏమిటంటే, అది సృష్టిరాసుల సేవకు సంబంధించి తప్పుడు సిధ్దాంతాల్ని, రాతారీతుల్ని సంస్క రిస్తుంది. అది చెప్పేదేమిటంటే ఒక మనిషిపై గల ఇంకో మనిషికి సంబంధించి హక్కు విషయంలో ప్రకృతిసిద్ధ క్రమాన్ని పాటించా లంటుంది. ఈ క్రమాన్ని ఫాలో అవ్వడం తప్పనిసరి అంటుంది. ఉదాహరణకు – తలిదండ్రులు, భార్యాపిల్లలు, బంధుమిత్రు హక్కు ఇతరుల హక్కులకన్నా ప్రాధాన్యం గలది. సేవ చేయాలన్న ఉత్సాహ ప్రవాహంలో సమాజపు ఇతర వ్యక్తుల అవసరాల్ని తీర్చి, సొంత తల్లిదండ్రుల, భార్యాపిల్లల, బంధుమిత్రుల హక్కుల్ని గుర్తించకపోవడం ఏ విధంగానూ సమంజసం కాదు అంటుంది. అలాగే కేవలం తనవారి పట్ల శ్రద్ధ వహించి సమాజంలోని ఇతర ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరిని సయితం అది ఎండ గడుతుంది. ఉభ యులతోనూ సమతౌల్యంగా వ్యవహరించాలంటుంది.
కొన్ని మతాలు అవలంబించిన రీతి రివాజుల మూలంగా మాన వులు ధనికులు, పేదలు అన్న రెండు వర్గాలుగా వేరై పోయారు. కొన్ని మత వర్గాలైతే బిక్షాటనను తన వృత్తిగా చేసుకొన్నాయి. ఇస్లాం ఈ రీతి రివాజుకు పూర్తి విరుద్ధం. ప్రజల మధ్య ధనిక, పేద అన్న తారతమ్యాన్ని గర్హిస్తుంది. ఉన్నవారు ఉన్నట్టుగా ఎదిగి పోవడం, లేనివారు అట్టడగున పడి ఉండటాన్ని అది సుతరామూ ఒప్పుకోదు. అలాగే ఒక వర్గం భిక్షాటపై బ్రతికేదిగా, మరో వర్గం ఉప కారం చేసేదిగా ఉండటాన్ని సయితం అది సహించదు. మనిషి అవసరార్థం సాటి మనిషి సహాయాన్ని కోరవచ్చు. కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ పరిస్థితి నుండి బైట పడాలి అంటుంది.
కొన్ని మతాలు సృష్టిరాసుల సేవనే సర్వస్వం, దాన్నే అసలు ధర్మం గా భావిస్తాయి. అనేకమంది పెద్దల గురించి వారు మతం మానవ సేవ మాత్రమేనని చెప్పడం మనం వింటూనే ఉంటాము. ఇటు వంటి ధోరణిని సంస్కరించాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సృష్టి రాసుల సేవ ఎంతో ప్రాధాన్యమైన అంశం అయినప్పటికి, ఇస్లాం దాన్ని మాత్రమే ధర్మంగా పరగణించదు. దాన్ని ధర్మంలోని ఒక భాగంగా మాత్రమే చూస్తుంది.
చివరి మాట ఏమిటంటే, ఇస్లాం దృష్టిలో ఏ సత్కార్యమైతే దైవప్రసన్నత, చిత్తశుద్ధి ప్రాతిపదికన చేయబడుతుందో, ఆ సత్కార్యం మాత్రమే ఆమోదముద్రను పొందుతుంది. మరే కార్యం వెనకాల పేరు ప్రతిష్టల కాంక్ష ఉంటుందో, పచ్చి స్వార్థం దాగి ఉంటుందో అట్టి కార్యాన్ని అది ఎంత ఘనతరమైనదైనా అల్లాహ్‌ా దర్బారులో ఆమో దం పొందజాలదు. పైగా అది శిక్షకు కారణం అవుతుంది. సృష్టి రాసుల సేవ ఎంత ముఖ్యమో, చిత్తశుద్ధి, నిస్వార్థం, దైవ ప్రస్నత కూడా అంతే ముఖ్యం. చిత్తశుద్ధి లేని ఎట్టి కర్మ ద్వారానైనా పుణ్యం, మోక్షా న్ని ఆశించలేము.
‘రాహె ఏతిదాల్’ సౌజన్యంతో