అల్లాహ్ మానవులకు అనుగ్రహించిన వరాలు అనంతం. వాటిని గురించి వర్ణించడం, ఊహించడం అసాధ్యం. అలాంటి అసంఖ్యాక వర్గాల్లో ‘నోరు’ (నాలుక) కూడా ఒకటి. మానవుల మధ్య పరస్పర సంబంధాలకు, సంభాషణ్చకు అదే వారధి. దీని వినియోగతీరుపైనే జయాపజయాలు, సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే, అమృతపు జల్లు జాలువారుతుంది. ప్రేమామృత కుసుమాలు పంచుతుంది. మంచిని పంచి మనిషి గౌరవమర్యాదల్ని ఇనుమడింపచేస్తుంది. సంఘంలో ఉన్నతస్థానాన్ని సమకూర్చిపెడుతుంది. శాంతి, సామరస్యాలను వెదజల్లుతుంది. దుర్వినియోగం చేస్తే మాత్రం విద్వేషం చిలకరిస్తుంది. అశాంతిని సృష్టిస్తుంది. సమాజంలో స్థాయిని దిగజారుస్తుంది. ఇహ పరలోకాల్లో ఆపదలు తెచ్చి పెడుతుంది. వైఫల్యానికి కారణమవుతుంది. అల్లాహ్ దృష్టిలో నోటి దురుసు, దుర్భాష, అస్లీలం తీవ్రమైన నేరాలు. దీనికి ఇహలోకంలో పరాభవం, పరలోకంలో నరకశిక్ష అనుభవించవలసి ఉంటుంది.
ముహమ్మద్ ప్రవక్త (స) ప్రవచనం ఇలా ఉంది: ‘ప్రళయదినాన విశ్వాసి త్రాసులో ఉంచబడే అత్యంత బరువైన, విలువైన వస్తువు అతని సుత్ప్రవర్తనే. నోటితో అశ్లీల మాటలు పలికేవారిని, దుర్భాషలాడేవారిని అల్లాహ్ అసహ్యించుకుంటాడు’ (తిర్మిజీ). కొంతమంది పైకి ఎంతో భక్తిపరాయణులుగా కనిపిస్తారు. కానివారు తమ నోటితో ఇతరుల్ని బాధిస్తుంటారు, వారి మనసులు గాయపరుస్తుంటారు. అలాంటి వారిని గురించి ప్రవక్త మహనీయులవారు ఏమన్నారో చూడండి… ‘ఒక స్త్రీ ఎన్నెన్నో నఫిల్ నమాజులు చేస్తుంది. మరెన్నో నఫిల్ ఉపవాస వ్రతాలూ పాటిస్తుంది. పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తూ ఉంటుంది. ఈ సత్కార్యాల కారణంగా ఆమె గొప్పదాతగా పేరుగాంచింది. కాని ఆమె తరచుగా తన నోటి దురుసుతో పొరుగువారిని బాధిస్తుంది’ అని ఒక వ్యక్తి ప్రవక్త వారికి విన్నవించాడు. ‘అయితే ఆమె నరకానికి పోతుంది‘ అన్నారు ప్రవక్త మహనీయులు.
ఆ వ్యక్తి మళ్ళీ ఇలా అన్నాడు. ‘దైవ ప్రవక్తా! ఒక స్త్రీ నఫిల్ నమాజులు, రోజాలు చాలా అరుదుగా పాటిస్తుంది. పెద్దగా దానధర్మాలు కూడా చేయరు. అప్పుడప్పుడు కొన్ని జున్ను ముక్కలు దానం చేస్తుంది అంతే. అయితే ఆమె తన నోటితో ఎప్పుడూ ఇరుగుపొరుగు వారిని బాధించదని, వారి మనసు నొప్పించదని జనం చెప్పుకుంటారు. ఈ మాట విని ప్రవక్త మహనీయులు, ‘ఆమె తప్పకుండా స్వర్గవాసి’ అని సెలవిచ్చాడు (మిష్కాత్)- అందుకే దేహంలోని అవయవాలన్నీ ఉదయం లేవగానే నాలుకతో (నోరు) ఇలా మొరపెట్టుకుంటాయట… ‘తల్లీ! నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. దైవానికి భయపడుతూ ఉండు. నువ్వు చల్లగా ఉంటేనే మేమూ చల్లగా ఉంటాం. నువ్వు ఏ మాత్రం మాట తూలావో మేమంతా హూనమై పోతాము.
ఎందుకంటే మేమంతా (అవయవాలు) నీతోనే అనుసంధానమై ఉన్నాము’ అని నోటితో మొరపెట్టుకుని, దీనంగా వేడుకుంటాయట. అందుకని నరం లేని ఈ నాలుక విషయంలో దైవానికి భయపడుతూ ఆచితూచి, ఉపయోగకరమైన మాటలనే పలకాలి. లేకపోతే అనేక అనర్థాలు జరుగుతాయి. దైవానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.