Originally posted 2013-05-19 06:51:24.
అబ్దుల్ ఖాదిర్ ఉమ్రీ
దయామయుడైన అల్లాహ్ పేరుతో
సర్వ మానవుల పట్ల మంచిగా మెలగండి:
”తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాథలూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ ఆధీనంలో ఉన్న దాస దాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నూ మిన్నూ కాననివారు, తమ గొప్పతనం గురించి విర్రవీగేవారు అంటే అల్లాహ్ ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి”. (ఖుర్‌ఆన్- 4: 36)
తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి:
”నీ ప్రభువు నిర్ణయం చేసేశాడు, మీరు కేవలం అయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి, తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి, ఒకవేళ మీవద్ద వారిలో ఒకరుగానీ, ఇద్దరుగానీ ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ‘ఉఫ్’ (ఛీ) అని కూడా అనకండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్ధిస్తూ ఉండండి; ప్రభూ! వారిపై కరుణ జూపు- బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు”. (ఖుర్‌ఆన్-17: 23,24)
భార్య హుక్కులను గుర్తించాలి:
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: ”నీవు తిన్నది ఆమెకూ పెట్టాలి. నీవు తొడిగినది ఆమెకూ తొడిగించాలి. ఆమె ముఖంపై కొట్టకూడదు. ఆమెను శాపనార్ధాలతో తిట్టకూడదు. ఆమెతో దూరంగా మెలిగినా అది ఇంటి వరకే పరిమితమై ఉండాలి”. ఒక మోమిన్ (విశ్వాసి), మోమినా (విశ్వాసురాలు) అయిన తన భార్యను అసహ్యించుకోకూడదు. ఆమెలోని ఏదైనా ఒక గుణం తనకు నచ్చకపోయినా ఎన్నో ఇతర గుణాలు తనకు పసందు కావచ్చు.
అనాథల పట్ల ఆదరణ:”అనాథల పట్ల కఠినంగా ప్రవర్తించకు”. (ఖుర్‌ఆన్-93:9)
మహా ప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: ”ఏ ముస్లింల ఇండ్లలో, ఒక తండ్రి లేని అనాథకు రక్షణ లభించి, ఆ అనాథ ఎడల సవ్యంగా ప్రవర్తించడం జరుగుతుందో అదే ఉత్తమ గృహం. మరి ఏ ఇంట్లో నయితే ఒక అనాథ ఉండి, ఆ అనాథ ఎడల చెడ్డగా ప్రవర్తించడం జరుగుతుందో ఆ ఇల్లు ముస్లిం ఇండ్లలోకెల్లా చెడ్డ ఇల్లు”. బానిసలు మీ సోదరులు:
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: ”అల్లాహ్ వారిని మీ ప్రయోజనార్ధం మీకు అప్పగించాడు. అయితే వారిని మీలో ఎవరి ఆధీనంలోనైతే ఉంచాడో వారు తాము ఏది తింటే అదే వారికి పెట్టాలి. తాము ఎలాంటి బట్టలు ధరిస్తారో వారికి అలాంటి బట్టలే ఇవ్వాలి. వారి శక్తికి మించిన పని భారాన్ని వారిపై మోపకూడదు. ఒకవేళ వారి శక్తికి మించిన పని చెప్పినట్లయితే అందులో వారికి తోడ్పడాలి.” ఉత్తములైన వారెవరూ ఎవరి నుండీ ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరరు:
”అల్లాహ్ మీద ప్రేమతో పేదలకూ, అనాథలకూ, ఖైదీలకు అన్నం పెట్టేవారు. ఈ ఉత్తమ మానవులు వారితో ఇలా అంటుండేవారు – మేము కేవలం అల్లాహ్ కోసమే మీకు అన్నం పెడుతున్నాము. మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నిగానీ, కృతజ్ఞతనుగానీ ఆశించడం లేదు”. (ఖుర్‌ఆన్- 76:8,9)
అగత్యపరులపై ధనాన్ని ఖర్చు పెట్టడం ఉత్తమ సత్కార్యం:
”అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువ ఇష్టపడే ధనాన్ని బంధువుల కొరకూ, అనాథల కొరకూ, నిరుపేదల కొరకూ, సహాయం చెయ్యండని అర్ధించేవారి కొరకూ, ఖైదీలను విడుదల చెయ్యడానికి ఖర్చు పెట్టడం అసలు సత్కార్యమంటే”. (ఖుర్‌ఆన్- 2:117)
వితంతువుల, నిరుపేదల కోసం శ్రమించాలి:
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: ”వితంతువుల కొరకూ, నిరుపేదల కొరకూ శ్రమించేవాడు, అల్లాహ్‌ా మార్గంలో నిరంతరం కృషి సలిపేవానికి సమానం. రేయంతా అల్లాహ్‌ా సన్నిధిలో నిల్చోని ప్రార్థన చేసినా అలసట ఎరుగని వానితో సమానం. పగటిపూట ఏమీ తినకుండా ఎడతెరపి లేకుండా ఉపవాస వ్రతం పాటించేవానితో సమానం”.
పొరుగువారి హక్కులను గుర్తించాలి:
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: తాను కడుపు నిండా భుజించి, తన ప్రక్కన ఉండే పొరుగువాడు పస్తులుండటాన్ని సహించే వ్యక్తి విశ్వాసి కాజాలడు.
ఎవడి దుర్నడత వల్లనైతే పొరుగువారికి ఇబ్బంది కలుగుతుందో దైవ సాక్షిగా వాడు విశ్వాసి కాడు.
అబూ జర్! నీవు ఏదైనా కూర వండినప్పుడు అందులో కాస్త నీళ్ళు ఎక్కువగా పొయ్యి. పొరుగువారిని కూడా కనిపెడుతూ (ఇస్తూ) ఉండు”.
ఇతరుల కష్టాలు చూసి ఆనందించకు, కష్టాలను దూరం చెయ్యి:
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: ”నీవు నీ సోదరుడిని కష్టాలలో చూసి సంతోషించకు. అల్లాహ్ అతనిపై కనికరించి నిన్ను కష్టాల పాల్జేయవచ్చు. ఇంకా ఆ మహనీయులు ఇలా అన్నారు: ”ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు. అతనికి ఎలాంటి అన్యాయమూ చేయడు. అతనిని అసహాయ స్థితిలోనూ వదలి వెయ్యడు. ఎవరైతే తన సోదరుని అవసరాన్ని తీరుస్తాడో, అతని అవసరాన్ని అల్లాహ్ తీరుస్తాడు. ఎవరైతే ఒక ముస్లింపై వచ్చిపడ్డ కష్టాన్ని దూరం చేస్తాడో, అతనికి ప్రళయ దినాన ఎదురయ్యే కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. ఎవరైతే ఒక ముస్లింలోని లోటుపాట్లను మరుగు పరుస్తాడో అల్లాహ్ ప్రళయ దినాన అతని తప్పిదాలను కప్పి పుచ్చుతాడు”.
ఇచ్చిపుచ్చుకోవడాల్లో నిజాయితీని కనబరచాలి:
”కొలపాత్రతో ఇస్తే పూర్తిగా నింపి ఇవ్వండి. తూచినట్లయితే సరైన తరాజుతో తూచండి. ఇది మంచి పద్ధతి, పర్యవసానాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమం”. (ఖుర్‌ఆన్-17:35)
”నా జాతి సోదరులారా! ఖచ్చితంగా న్యాయంగా పూర్తిగా కొలవండి, తూచండి. ప్రజలకు వారి వస్తువులను తక్కువ చేసి ఇవ్వకండి”. (ఖుర్‌ఆన్-11:85
మోసం చేసేవారికి వినాశం తప్పదు:
”తూనికలలో, కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశం ఉన్నది. వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా తీసుకుంటారు. కాని వారికి కొలచిగానీ, తూచిగానీ ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు. ఒక మహా దినం నాడు వారు బ్రతికించి తీసుకు రాబడనున్నారని వారికి తెలీదా? ఆ రోజున ప్రజలందరూ సకల లోకాల ప్రభువు సమక్షంలో నిలబడతారు”. (ఖుర్‌ఆన్-88:1-8)
భూమిపై విర్ర వీగుతూ నడవకండి:
”భూమిపై విర్ర వీగుతూ నడవకండి. మీరు భూమిని చీల్చనూ లేరు, పర్వతాల ఎత్తుకు చేరనూ లేరు”. (ఖుర్‌ఆన్-17:37)
”కరుణామయుని సిసలైన దాసులు ఎవరంటే వారు నేలపై అణకువతో నడిచేవారూ, మూర్ఖులు వారిని పలుకరించినప్పుడు మీకో సలాం అని అనేవారూ, తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడి, నిలబడి రాత్రులు గడిపేవారు. ‘మా ప్రభూ! నరక యాతనల నుండి మమ్మల్ని కాపాడు, దాని శిక్ష ప్రాణాంతకమైనది, అది ఎంతో చెడ్డ నివాసం’ అని దీనంగా వేడుకునేవారు”. (ఖుర్‌ఆన్-25:63)
కల్లోలాన్ని సృష్టించడం క్షమించరాని నేరం:
”ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే- భూమిలో (సాయుధులై, ముఠాగా ఏర్పడి దోపిడికీ, విధ్వంసక చర్యలకూ పాల్పడుతూ) కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగేవారికి శిక్ష ఏమిటంటే, వారిని చంపడం లేదా శిలుపైకి ఎక్కించడం లేదా చేతులు, కాళ్ళను అభిముఖ దిశలో ఖండించడం లేదా దేశం నుండి బహిష్కరించటం. ఇది వారికి ఇహలోకంలో జరిగే అగౌరవం, అవమానం. పరలోకంలో వారికి ఇంతకంటే ఘోరమైన శిక్ష ఉంటుంది”. (ఖుర్‌ఆన్-5:32,33)
వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి:
”వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి. అది అతి దుష్టకార్యం. బహు చెడ్డ మార్గం”. (ఖుర్‌ఆన్-17:32)
”నిజమైన విశ్వాసులు తమ మర్మాంగాలను పరిరక్షించుకుంటారు”. (ఖుర్‌ఆన్-23:5)
మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: ”పర స్త్రీ మీద నీ చూపు ఆనక పూర్వమే నీవు దృష్టి మరల్చుకో”.
పురుషులు చూపులను కాపాడుకోవాలి:
”ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని చెప్పు. ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. వారు చేసే దాని గురించి అల్లాహ్‌ాకు బాగా తెలుసు”. (ఖుర్‌ఆన్-24:30)
మహిళలు పరదాను పాటించాలి. ఇది వారి కొరకు ఉత్తమం:
”ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు: తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని, తమ అలంకరణను ప్రదర్శించవలదని. తమ వక్షస్థలాలను ఓణి అంచులతో కప్పుకోవాలి. వారు తమ అలంకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందూ ప్రదర్శించకూడదని; భర్త, తండ్రి, భర్తల తండ్రులు, తమ కుమారులు, భర్తల కుమారులు, అన్నదమ్ములు, అన్నదమ్ముల కుమారులు, అక్కాచెల్లెళ్ళ కుమారులు, తమతో కలిసి మెలసి ఉండే స్త్రీలు, తమ స్త్రీపురుష బానిసలు, వేరే ఏ ఉద్దేశమూ లేని వారి క్రింద పని చేసే పురుష సేవకులు, స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు. తాము గుప్తంగా ఉంచిన తమ అలంకరణ ప్రజలకు తెలిసేలా వారు తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని కూడా వారికి చెప్పు. (ఖుర్‌ఆన్-24:31)
ఎవరూ వివాహం లేకుండా ఒంటరిగా ఉండరాదు:
”మీలో ఎవరు వివాహం లేకుండా ఒంటరిగా ఉంటున్నారో, మీ స్త్రీపురుష బానిసలలో ఎవరు గుణవంతులో, వారి వివాహాలు చేసి వేయండి. వారు గనక పేదవారయితే, అల్లాహ్‌ా తన అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేస్తాడు. అల్లాహ్ అంతులేని వనరులు కలవాడు”. (ఖుర్‌ఆన్-24:32,33)
అనుమతి లేకండా ఇతరుల ఇళ్లల్లోకి ప్రవేశించకండి:
”విశ్వసించిన ప్రజలారా! మీ ఇళ్ల్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి ప్రవేశించకండి – అనుమతి పొందనంతవరకు, సలామ్ చేయనంత వరకు. ఈ పద్ధతి మీకు ఎంతో ఉత్తమమైనది. దీనిని మీరు పాటిస్తారని ఆశించబడుతోంది. ఇంకా ఒకవేళ అక్కడ మీరు ఎవరినీ కనుగోకపోతే మీకు అనుమతి ఇయ్యబడనంతవరకు ప్రవేశించ కూడదు. ఒకవేళ తిరిగి వెళ్ళిపొమ్మని మీతో అంటే, తిరిగి వెళ్ళి పోండి. ఇది మీకు ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. మీరు ఏది చేస్తారో, అది అల్లాహ్‌ాకు తెలుసు”. (ఖుర్‌ఆన్-24:27,28)
శీలవతులైన స్త్రీలపై అబాంఢం వేయరాదు:
”శీలవతులు, అమాయికలు అయిన స్త్రీలపై అభాండం వేసేవారు ప్రపంచంలోనూ, పరలోకంలోనూ శపించబడ్డాడు. వారికి పెద్ద శిక్ష పడుతుంది”. (ఖుర్‌ఆన్-24:23)
”ఎవరైనా శీలవతులైన స్త్రీలపై నిందమోపి తరువాత నలుగురు సాక్షులను తీసుకురాకపోతే, వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి. వారే దుర్మార్గులు”. (ఖుర్‌ఆన్-24:4,5)
వ్యభిచారిణిని, వ్యభచారిని కఠినంగా శిక్షించండి:”వ్యభిచారిణి, వ్యభచారిని – ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికీ నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మీరు అల్లాహ్‌పై, అంతిమ దినంపై విశ్వాసం ఉన్నవారే అయితే, వారి మీద కనికరం చూపే తలంపు అల్లాహ్ ప్రసాదించిన ధర్మ (నిర్వహణ) విషయంలో మిమ్మల్ని అడ్డుకోరాదు. వారిని శిక్షించేటప్పుడు విశ్వాసుల వర్గం ఒకటి అక్కడ ఉండాలి”. (ఖుర్‌ఆన్-24:2)
సారాయి, జూదం అసహ్యకరమైన షైతాన్ పనులు:
”విశ్వాసులారా! సారాయి, జూదం, దైవేతరాలయాలు, పాచికల ద్వారా జోస్యం- ఇవన్నీ అసహ్యకరమైన షైతాన్ పనులు, వాటిని విసర్జించండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. షైతాన్ సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధవిద్వేషాలను సృష్టించాలనీ మిమ్మల్ని అల్లాహ్ స్మరణ నుండి, నమాజు నుండి వారించాలని కోర్తాడు”. (ఖుర్‌ఆన్-5:90)
వడ్డీని తినటం మానండి:”విశ్వసించిన ప్రజలారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినడం మానుకోండి. అల్లాహ్‌కు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది. అవిశ్వాసుల కొరకు తయారు చేయబడిన ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి”. (ఖుర్‌ఆన్-3:130,131)