ఆధ్యాత్మికతకు ఆలవాలమైన మనదేశంలో అనేక మతధర్మాలు ఉన్నాయి. మౌలికంగా అన్ని మతాలు, అన్ని ధర్మాలు మంచిని, మానవతను మాత్రమే బోధిస్తాయి. ఏమత ధర్మమైనా ఇతరులను ద్వేషించమని, దూషించమని చెప్పదు. హింసను ప్రేరేపించదు. ఒకవేళ ఏ మతమైనా ఇతరుల పట్ల, ఇతర మతాల పట్ల ద్వేషభావం కలిగి ఉన్నట్లయితే, అది మతం ఎంత మాత్రం కాదు.
నిజానికి మతమంటే మతిని సంస్కరించేది, మంచిని, మానవత్వాన్ని నేర్పేది. శాంతిని, ప్రేమను ప్రబోధించేది. మానవుల మధ్య పరస్పరం స్నేహభావాలను ప్రోదిచేసేది. మనసులోని మాలిన్యాన్ని తొలగించి మమతను నింపేది.
స్వార్థం, ద్వేషం, అసూయ, హింస, దుర్మార్గం, కపటం లాంటి దుర్గుణాలన్నింటినీ దూరం చేసి ప్రేమను ప్రతిష్ఠించేది. ఇతరులనూ, ఇతర మతాలనూ ద్వేషించేదీ, దూషించేదీ, శత్రుభావాలను ప్రేరేపించేదీ మతం ఎంత మాత్రం కాదు.
సమాజంలో భయోత్పాతాన్ని, హింసోన్మాదాన్ని సృష్టించడం, ప్రజల ధనమాన ప్రాణాలకు హాని కలిగించడం మతాభిమానం ఎంత మాత్రం కాదు.
మార్గవిహీనులకు మార్గం చూపడం, దౌర్జన్యాలను నిరోధించడం, అశాంతిని దూరం చేయడం, సర్వమానవ సంక్షేమాన్ని కాంక్షిస్తూ, సమాజ శ్రేయస్సుకు, సంస్కరణకు ప్రయత్నించడం, మానవులను ఉత్తములుగా, అందరి మేలు కోరేవారుగా, పరోపకారులుగా, పరిపూర్ణ మానవతావాదులుగా మలచడమే నిజానికి మతం యొక్క అభిమతం.
కాని దురదృష్టవశాత్తు ఈనాడు మతం పేరుతో ఎన్నోదుర్మార్గాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని మతం కోణంలో చూడడం జరుగుతోంది. ఇది పూర్తిగా తప్పు.
మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా ఆలోచిస్తే, మతమన్నదేదైనా ఒక మనిషి ప్రాణం తీయమని చెబుతుందా? చెప్పదు. ఏ మతమూ చెప్పదు. ఒకవేళ అలాంటి బోధనలు ఏ మతంలోనైనా ఉన్నాయంటే, అది మతం కాదు. కనుక అలా ఉండడానికి లవలేశమైనా అవకాశం లేదు. అందుకే, ‘ఒక్క మానవుణ్ని చంపితే మొత్తం మానవుల్ని చంపినట్లే’ అని చెబుతోంది పవిత్రఖురాన్.
‘నువ్వు నీ సాటివాడికి నీ నోటితో గాని, నీ చేతితో గాని ఏ చిన్నపాటి బాధ కలిగించినా నువ్వు దైవానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి ఉంటుంది’ అంటున్నారు ముహమ్మద్ ప్రవక్త.
‘మానవులంతా దేవుని కుటుంబం. కనుక మీరంతా కుటుంబసభ్యుల్లా కలిసిమెలసి, శాంతి సామరస్యాలతో, పరస్పర సహకారభావనతో అన్యోన్యంగా ఉండాలి’ అంటోంది ఇస్లాం.
‘సాటివారిని ప్రేమించనిదే, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోనిదే నువ్వు స్వర్గానికి ఎలా అర్హత సాధిస్తావు?’ అంటోంది ఈ ధర్మం. ‘రోడ్డుపై ముళ్లు, రాళ్లు, రప్పలు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించి ఇతరులకు బాధ కలగకుండా చూడు’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త.