మస్జిదె అక్సాకు పొంచి ఉన్న ప్రమాదం

masjid-al-aqsa-in-jerusalem-palastine-dome

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
సామ్రాజ్యవాదులైన జియోనిస్టులు మరోసారి పవిత్ర క్షేత్రం (బైతుల్‌ మఖ్దిస్‌)లో రక్త తర్పణానికి సిద్ధమైనట్లున్నారు. చరిత్రాత్మకమైన మస్జిదె అక్సాపై శతాబ్దాలుగా డేగ కన్ను వేసిన జియోనిస్టులు చాలా పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. ముస్లింలు ప్రాణప్రదంగా భావించే మస్జిదె అక్సా పరీవాహక ప్రాంతంలో యూదుల కోసం సరికొత్తగా ఒక కాలనీని జబర్దస్తీగా నిర్మించాలన్నది తాజా వ్యూహం. ఈ నవ నిర్మాణాలపై సభ్య ప్రపంచంలో సర్వత్రా నిరసన వ్యక్తమైనా ఇస్రాయీల్‌ వినిపించుకోవటం లేదు. ఆఖరికి ఇస్రాయీల్‌కి వెన్నుదన్నుగా నిలిచే అమెరికా సైతం తన మానస పుత్రుల్ని సముదాయించేందుకు యత్నించింది. అయినాసరే జియోనిస్టులు హైలెవల్లో లాబీయింగ్‌ జరిపి వైట్‌ హౌస్‌ దొరల ఆశీర్వాదం పొందగలిగారు. ఇస్రాయీల్‌ గనక ఈ నవ నిర్మాణాలను మొదలుపెడితే జెరూసలేం చరిత్రలో మరో బడబాగ్నికి ఆజ్యం పోసినట్లే.

మస్జిదె అక్సా పరీవాహక ప్రదేశంలో సొరంగాలు త్రవ్వి, లోపలి భూభాగాన్ని ఇస్రాయీల్‌ డొల్లగా చేసేస్తోందని గత కొన్నేళ్ళుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కొత్త కాలనీ నిర్మాణ ప్రకటన ముస్లిం జగతిలో కలవరం సృష్టించటం సహజమే. తమ చేతికి మట్టి అంటకుండానే కాగల కార్యాన్ని జరిపించాలన్నది ఇస్రాయీల్‌ వ్యూహం.

ఈ సొరంగాల ప్రభావంగా మస్జిద్‌ పునాదులు కదలి, పవిత్ర కట్టడం కూలిపోవచ్చు!? ఒకవేళ అదే గనక జరిగితే ఆ స్థలంలో ‘హైకలె సులైమాన్‌’ స్థూపాన్ని ప్రతిష్ఠించాలన్న జియోనిస్టుల పైశాచిక స్వప్నం సాకారమయ్యేందుకు మార్గం సుగమమవుతుంది. దరిమిలా ఆ ప్రదేశంలో ముస్లిం జన సంచారం దానంతట అదే తగ్గిపోతుంది. యూదుల నూతన బస్తీలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతుంది! ఇదీ ఇస్రాయీల్‌ పథకం!

ప్రస్తుతం బైతుల్‌ మఖ్దిస్‌ (జెరుసలేం) గ్రంథ వహులైన యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు సమానమైన పుణ్యక్షేత్రంగా వర్తిస్తూ ఉన్నది. ప్రవక్తలు ప్రభవించిన ఈ పవిత్ర క్షేత్రానికి దూర దేశాల నుంచి యూదులు, క్రైస్తవులు తరలి వచ్చినట్లే ముస్లింలు కూడా సుదీర్ఘ ప్రయాణం చేసి వస్తారు. సువిశాలమైన బైతుల్‌ మఖ్దిస్‌ ఆవరణలోనే ఉన్న ‘మస్జిదె అఖ్సా’ ఒకప్పుడు ముస్లింల ‘ఖిబ్లా’గా ఉండేది. దేవుడు ఈ భూభాగాన్ని శుభవంతమైన ప్రదేశంగా అభివర్ణించాడు. ‘ఇస్రా’గా ప్రసిద్ధి చెందిన ఒకానొక రాత్రి సమయంలో దేవుడు తన అంతిమ ప్రవక్త (స)ను మక్కాలోని మస్జిదె హరాం నుంచి తీసుకుపోయిన మస్జిద్‌ ఇదే. ఈ మస్జిద్‌లోనే మహా ప్రవక్త (స) సారథ్యంలో దైవప్రవక్తలంతా ప్రార్థన చేశారు. ఈ విశ్వ విఖ్యాత మస్జిదు నుండే మహా ప్రవక్త (స) గగనయాత్ర చేశారు. మస్జిదె హరాం, మస్జిదె నబవీల తర్వాత ముస్లింలు పుణ్యార్జన కోసం ప్రయాణం చేసే మస్జిద్‌ ఏదైనా ఉందంటే అది మస్జిదె అక్సా మాత్రమే. ఈ మస్జిదులో చేసే ఒక్క నమాజ్‌ వేరితర మస్జిద్‌లలో చేసే రెండు వందల యాభై నమాజులకు సమానం.

అటువంటి కీలక మస్జిద్‌పై నేడు వంచనా శిల్పనిష్ణాతులైన యూదులు పంజా విసురుతుంటే ముస్లింలు కలత చెందిన మనసుతో కన్నీరు కార్చడం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తమను ఈ దీనావస్థలోకి నెట్టివేసిన పరిస్థితికి కారణాలేమిటో శ్రేష్ఠ సమాజ సభ్యులు బేరీజు వేసుకోవాలి. పశ్చాత్తాప భావంతో తమ ప్రభువు వైపునకు మరలి విలపిస్తూ ప్రార్థిస్తారో, తమలో పెచ్చరిల్లిన పదార్ధ పూజపై సిగ్గుతో కుంచించుకుపోతారో, తమలో నిద్రాణమై ఉన్న స్వాభిమానాన్ని మేల్కొలిపి ఒకే త్రాటిపై నడిపించే మరో సలాహుద్దీన్‌ అయ్యూబీని ప్రసాదించమని అర్థిస్తారో – ఏం చేస్తారో చేయాలి. నింగినున్నవాడు తప్పకుండా సాయం చేస్తాడు. కాని సాయం అడగటం కూడా చేతనవ్వాలి కదా!

 

Related Post