నెలవంక సౌజన్యంతో
దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు:
”తన సహచరుల పట్ల ఉత్తమంగా మెలిగేవాడే అల్లాహ్‌ా దృష్టిలో అత్యుత్తమ స్నేహితుడు. తమ ఇరుగుపొరుగు వారి పట్ల ఉత్తమంగా మెలిగేవాడే అల్లాహ్‌ా దృష్టిలో అత్యుత్తమ పొరుగువాడు”. (తిర్మిజీ)
పొరుగువారిని కలిసినప్పుడు సలాం చెప్పి వారి యోగక్షేమాలు విచారించాలి.
వారు రోగగ్రస్థులై ఉంటే వెళ్ళి వారిని పరామర్శించాలి. అవసరమైతే చేతనైనంత సహాయం అందించాలి.
వారిపై అనుకోని విపత్తు ఏదైనా వచ్చి పడినా, వారి ఆప్తులైవరైనా మరణించినా వెళ్ళి వారిని ఓదార్చాలి. వారి కష్టాల్లో పాలు పంచుకోవాలి.
వారి ఇళ్ళకు వెళ్ళవలసి వచ్చినప్పుడు దృష్టిని కాపాడుకోవాలి. వారి పరువు ప్రతిష్టల్ని కాపాడాలి. వారు లేనప్పుడు వారి ఇంవిరిదీరి కనిపెట్టి ఉండాలి.
టీ.వి, టెప్ రికార్డర్ మొదలగువాటి సౌండ్ తగ్గించి పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు సైతం మెల్లగా మాట్లాడుకోవడం ఉత్తమం. ముఖ్యంగా విశ్రాంతి వేళల్లో.
సమయం సందర్భానుసారం వారికి హితబోధ చేస్తుండాలి. వారికి తెలియని ధార్మిక విషయాలను వారికి తెలియజేస్తూ ఉండాలి.
వారు మనతో చెడుగా ప్రవర్తించినా మనం మాత్రం వారితో మంచిగానే వ్యవహరించాలి.
అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్(ర) దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, ”నాకో పొరుగు వాడున్నాడు. అతను ఎప్పుడు చూసినా నన్ను బాధపెడుతూ, బండబూతులు తిడుతూ, శాపనార్థాలు పెడుతూ, మనో వేదనకు గురిచేస్తుంటాడు” అని విన్నవించు కున్నాడు. అది విన్న ఆయన (ర) ”అతను నీ విషయంలో దైవ అవిధేయతకు పాల్పడ్డాడు నిజమే. కానీ నువ్వు మాత్రం అతని విషయంలో అల్లాహ్‌ా విధేయతా మార్గాన్నే అవలంబించు” అని హితవు పలికారు.
చీటికి మాటికి వారితో తగువులాటకు దిగకూడదు. వెళ్ళేందుకు దారి లేకుండా చేయడం, వారి గుమ్మం ముందు చెత్తా చెదారం పారేయడం లాంటివి ఉత్తముల లక్షణాలు కావు. వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
దైవప్రవక్త (స) ఓ సందర్భాన ఇలా ప్రబోధించారు: ”అల్లాహ్‌ా సాక్షి! అతడు విశ్వాసి కాజాలడు. ”అల్లాహ్‌ా సాక్షి!! అతడు విశ్వాసి కాడు. ”అల్లాహ్‌ా సాక్షి! అతడు విశ్వాసి కాలేడు” అని. ”ఎవరు దైవప్రవక్తా!” అని అడగ్గా; ”తన వెకిలి చేష్టలతో ఇరుగుపొరుగు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నవాడు” అని ఆయన (స) సమాధాన మిచ్చారు.
అర్థ రాత్రి వేళయినా అవసరం ఉండి పిలిస్తే వెళ్ళాలి. అలాగే ఇంట్లో వండిన వంటకాలు పక్కింటివారికి చేరేటట్లు ప్రయత్నించాలి.
దైవప్రవక్త (స) ఇలా హితోపదేశం చేశారు: ”ఓ ముస్లిం మహిళల్లారా! ఏ ఇరుగింటి స్త్రీ తన పొరుగింటావిడ (ఇచ్చిన కానుక)ను అల్పమైనదిగా భావించకూడదు. అది మేక కాలి గిట్ట అయినా సరే”. (బుఖారీ, ముస్లిం)