అనువాదం; ముహమ్మద్ సలీం జామయీ
దైవదాసులు పుణ్యాలు చేసి అత్యంత శ్రేష్ఠ మయిన సామగ్రి అయిన ‘తఖ్వా’ను మూట కట్టుకోవాలనీ, వారి జీవితాలు పునీతమవ్వాల నీ ఆ పరమదాత కొన్ని వసంత రుతువుల్ని కేటాయించాడు. ఆ శుభవంతమయిన, పవిత్రమయిన రుతువుల్లో ఓ పుణ్య రుతువే జుల్ హిజ్జ మాసపు మొదటి పది రోజులు. ఆ విషయానికొస్తే, ప్రవక్త (స)వారి కాలం నాటి నుండి సజ్జనులయిన మన పూర్వీకులు మూడు పదులను గొప్పవిగా భావించే వారు.1) జుల్‌హిజ్జా మొదటి పది రోజులు. 2) రమజాను మాసపు చివరి పది రోజులు. 3) ముహర్రమ్ మాస పు తొలి పది రోజులు.
అల్లాహ్ కొన్ని ప్రత్యేక సమయాలను ఇతర సమయాలపై, కొన్ని నెలలను ఇతర నెలలపై, కొన్ని దినాలను, రాత్రులను ఇతర దినాలు, రాత్రులపై ప్రాముఖ్యత నిచ్చి శుభప్రదమై నవిగా ఖరారు చేశాడు. ఆ ప్రత్యేక దినాలలో చేయబడే పుణ్యకార్యాలు అనేక రెట్లు గణింప బడతాయి. ఆ ప్రత్యేక, శుభప్రదమైన దినాల లో జుల్‌హిజ్జ మాసపు పది దినాలు కూడా ఉన్నాయి. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”నిశ్చ యంగా నెలల సంఖ్య అల్లాహ్‌ా దగ్గర – అల్లాహ్‌ా గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచే (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది).
వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం”. (తౌబా:36)
అంతిమ దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”కాలం తిరిగి యధాస్థితికి-అల్లాహ్‌ా భూమ్యా కాశాలను సృష్టించిన నాటి స్థితికి వచ్చేసింది. ఏడాదిలో పన్నెండు మాసాలుంటాయి. వాటి లో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (పవిత్ర మైనవి) వాటిలో మూడు మాసాలు ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. అవే- జుల్ ఖఅద, జుల్‌హిజ్జ, ముహర్రం, నాల్గవ మాసం రజబ్. ఇది జమాదివుల్ ఆఖిర్ – షాబాన్ నెలలకీ మధ్య ఉంటుంది”. (బుఖారి)
జుల్ హిజ్జ మాసపు పది దినాల ప్రాముఖ్యత:
1) అల్లాహ్ ఈ దినాలపై ప్రమాణం చేయ టం: ”ఉషోదయం సాక్షిగా! పది రాత్రుల సాక్షిగా!”. (అల్ ఫజ్ర్:1-2)
‘పది రాత్రులు’ అంటే జుల్ హిజ్జ నెలలోని మొదట పది రాత్రులని అత్యధిక మంది ఖుర్‌ఆన్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు.
2) సంవత్సరంలోని ఇతర దినాల కంటే జుల్ హిజ్జ మాసపు మొదటి పది రోజులు ఉత్తమ మైనవి: ”జుల్ హిజ్జ నెలలోని ప్రథమ థకం లో చేసిన పుణ్య కార్యాలు అల్లాహ్‌కు అన్నిటి కన్నా ఎక్కువ ప్రియమైనవి, ఆ ఖరికి దైవమార్గంలోజరిపిన పోరాటం కూడా దీనంతగా ప్రియమైనది కాదు. అయితే మనిషి తన ధన, ప్రాణాలు పణంగా పెట్టి అమరగతి నొందే పోరాటం సంగతి వేరు” అని మహా ప్రవక్త (స) ప్రవచించారు. (బుఖారి)
3) జుల్ హిజ్జ మాసపు తొలి పది రోజుల లోనే ‘అరఫా’ రోజు ఉంది: హజ్‌కి అసలైన రోజు అరఫా రోజు. అనగా పాపాల క్షమా పణ, నరకం నుంచి విముక్తి పొందే రోజు.
4) జుల్ హిజ్జ మాసపు తొలి పది రోజులలో నే ‘యౌమున్నహర్’ (ఖుర్బానీ దినం): దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”దినాలలో అన్నింటికంటే ఉత్తమమైన దినం యౌము న్నహర్ -ఖుర్బానీ దినం”. (అబూ దావూద్, నసాయి) ఈ హదీసు ఆధారంగా కొంత మంది పండితులు దినాలలో అన్నింటికంటె ఉత్తమమైన దినం యౌమున్నహర్. అనగా జుల్ హిజ్జ మాసపు పదవ రోజు (పండగ రోజు) అనంటారు.
5) జుల్ హిజ్జ మాసపు తొలి పది రోజులలో ని ప్రార్థనలు: ఇబ్నెహజర్ (ర) ఇలా అన్నారు: ”ముఖ్యమైన ప్రార్థలన్నీ ఉదా: నమాజు, ఉప వాసం, సదఖా, హజ్ మొదలగు ప్రార్థలన్నీ ఈ పది రోజులలో జమ అవుతాయి. మిగతా రోజుల్లో అలా జరగదు”.(ఫత్‌హుల్ బారీ)
జుల్ హిజ్జ తొలి పది రోజులలో చేసే ముస్తహబ్ పనులు
1) హజ్ ఉమ్రాకు సంబంధించిన కార్యాలను నెరవేర్చటం.
2) ‘అరఫా’ రోజు ఉపవాసం ఉండటం: దైవ ప్రవక్త (స) అరఫా రోజు యొక్క ప్రాముఖ్యత చెబుతూ ఇలా ప్రవచించారు: ”అరఫా దిన మున ఉండే ఉపవాసం రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళనం చేస్తుంది.” (ముస్లిం)
3) ఫర్జ్ నమాజులను, వాటి సమయాలలో నెరవేర్చటం ప్రతి ముస్లిం తప్పనిసరి విధి. నఫిల్ నమాజులను కూడా ఎక్కువగా పాటిం చాలి.ఎందుకంటే,అల్లాహ్‌ా ప్రసన్నత పొందేం దుకు ఇవి ముఖ్య కారకాలు గనక. దైవప్రవక్త (స), అల్లాహ్ మాటను తెలియజేస్తూ ఇలా అన్నారు: ”నా దాసుడు నఫిల్ నమాజుల వలన నాకు అతి దగ్గరగా అవుతుంటాడు, చివరికి నేనతన్ని ఇష్ట పడతాను…..”. (బుఖారి)
4) జిక్ర్ చేయటం: (దైవనామ స్మరణ): దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”పుణ్య కార్యాలు అమితంగా ఇష్టపడే దినాలలో జుల్ హిజ్జ మాసపు పది దినాలు కాకుండా అల్లాహ్ దృష్టిలో వేరే దినాలేమీ లేవు. కాబట్టి ఈ సమయంలో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ ‘అల్లాహు అక్బర్’ అల్ హమ్దులిల్లాహ్‌ా’ ఎక్కు వగా పఠించండి”. (అహ్మద్)
5) సదఖా చేయటం: సదఖా చేయటం సత్కా ర్యాలలో ఒకటి. ఈ రోజులలో చేయటం ముస్తహబ్. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”ఓ విశ్వాసులారా! వ్యాపార లావాదేవీలుగానీ, స్నేహబంధాలుగానీ, సిఫార్సులుగానీ, ఉండని ఆ రోజు రాక ముందే మేము మీకు ప్రసాదిం చిన దానిలో నుంచి ఖర్చు చేయండి. వాస్తవా నికి తిరస్కారులే దుర్మార్గులు”.(అల్‌బఖర:254)
6. ఖుర్బానీ ఇవ్వటం; దైవప్రవక్త (స) ప్రతి సంవత్సరం ఖుర్బానీ ఇచ్చేవారు. ఆయన (స) ఇలా సెలవిచ్చారు: ”ఖుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా ఖుర్బానీ ఇవ్వని వాడు మా ఈద్గాహ్‌ాకు రాకూడదు”. (ఇబ్నెమాజహ్)
ఖుర్బానీ ప్రాశస్త్యం
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) ఇలా ఉపదేశించారు: ”జుల్ హిజ్జ పదవ తేది (పండుగ రోజు) ఆదం పుత్రుడు ఇచ్చే ఖుర్బా నీకన్నా అల్లాహ్‌ా దృష్టిలో మరే పుణ్య కార్య మూ గొప్పది కాదు. ఖుర్బానీ జంతువులు ప్రళయం నాడు తమ కొమ్ములు, ఖురములు
మరియు వెంట్రుకలతో సహా వచ్చి సాక్ష్యమి స్తాయి. అలాగే ఖుర్బానీ పశువు రక్తం నేలపై పడక ముందే అల్లాహ్‌ా దగ్గర దాని ఖుర్బానీ ఎంతో ఘనతాదరణలతో స్వీకరించబడు తుంది. కనుక మీరు సంతోషంగా, మనస్ఫూ ర్తిగా ఖుర్బానీ ఇస్తూ ఉండండి”. (తిర్మిజీ).
ఖుర్బానీ అంటే:
జుల్ హిజ్జ మాసపు 10వ తేదీన అనగా పండుగ రోజు పండుగ నమాజు తర్వాత నుండి 13 జుల్‌హిజ్జ తేదీన సూర్యాస్తమయం వరకు దైవప్రసన్న కోసం పశువుని జబహ్ చేయడాన్ని ఖుర్బానీ అంటారు.
ఖుర్బానీ ఆదేశం:
ఖుర్బానీ చేయాలని అల్లాహ్ ఆదేశించాడు:
”నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి మరియు ఖుర్బానీ ఇవ్వు.”(కౌసర్:2)
ప్రముఖ సహాబీ అనస్ (ర) ఇలా తెలియ జేసారు: ”దైవప్రవక్త ముహమ్మద్(స) రెండు పొట్టేళ్ళను ఖుర్బానీ ఇచ్చేవారు కాబట్టి నేను కూడా రెండు పొట్టేళ్ళను ఖుర్బానీ ఇచ్చేవాడిని. (బుఖారీ)
ఖుర్బానీ ప్రాముఖ్యత:
స్థోమత ఉన్న ప్రతి వ్యక్తిపై ఖుర్బానీ చేయడం ”వాజిబ్” తప్పనిసరి. అని అధిక శాతం పండితుల అభిప్రాయం.
దైవప్రవక్త ముహమ్మద్(స) ఇలా తెలియజేసారు: ”స్థోమత,సౌకర్యం ఉండి కూడా ఖుర్బానీ ఇవ్వని వ్యక్తి మా ఈద్గాహ్‌ా (పండుగ నమాజు చేసే బహిరంగ మైదానం) దరిదాపులకు కూడా రాకూడదు. (అహ్మద్, ఇబ్నెమాజ – సహీహ్)
ఖుర్బానీ పశువులు – లక్షణాలు:
ఒంటె ఆడదైనా, మగదైనా
ఆవు, ఎద్దు
మేక, పోతు
గొర్రె, పొట్టేలు
ఈ నాలుగు రకాల పశువులు మాత్రమే ఖుర్బానీ ఇవ్వాలి. ఇవికాక ఇతర జంతువుల ఖుర్బానీ చెల్లదు. (22/34)
గేదె, దున్న పోతులను ఖుర్బానీ చేయాలను కుంటుంటారు కొందరు – కానీ అవి ఖుర్బానీ జంతువులు కావని గ్రహించాలని మనవి చేస్తున్నాము.
ఖుర్బానీ ఇవ్వబడే పశువు బాగా బలంగా, లావుగా, లోపాలు లేకుండా ఉత్తమమైనదిగా ఉండాలి. (ఇబ్నెమాజ)
రెండు కొమ్ములు గల, ఖసీ చేయబడిన పశువైతే మంచిది. (ఇబ్నెమాజ)
మేక, పోతు, గొర్రె, పొట్టేలు పళ్ళు (పాల పళ్ళు వూడిన తరువాత వచ్చే పళ్ళు) గలదై ఉండాలి. దొరకని సందర్భంలో ఒక సంవత్సరము వయసుగలది లేక సంవత్సరానికి కొంచెం తక్కువ వయసుగల పొట్టేలు సరిపోతుంది. (ముస్లిం)
మంచి పశువు లభ్యమౌతున్నా పిసినారితనం ప్రదర్శించటం, డబ్బులు మిగిలుంచుటకు చిన్న పశువును కొనటం భక్తునికి తగిన విషయం కాదు.
పళ్ళు వూడని మేక ఖుర్బానీ చెల్లదు. (బుఖారీ, ముస్లిం)
ఒంటెకు 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరం జరుగుతుండాలి. (షరహ్‌ా సునన్ అబీ దావూద్ ఉర్దూ 2/628)
ఒంటికన్ను పశువు, కుంటి పశువు, రోగగ్రస్తు పశువు ఎముకల్లో సత్తువ లేకుండా బాగా ముసలిదైపోయిన పశువులను ఖుర్బానీ చేయకూడదని ప్రవక్త(స) తెలిపారు.(తిర్మిజి, ఇబ్నెమాజ, అహ్మద్)
ఇవి కాక మరే ఇతర లోపం బహిర్గతంగా కనబడుతున్నా అలాంటి పశువును ఖుర్బానీ చేయరాదు. కనిపించని చిన్న లోపమైతే ఇన్షాఅల్లాహ్‌ా కమించబడుతుంది.
ఏ పశువు ఖుర్బానీ ఉత్తమమైనది? ధార్మిక పండితులు ఈ విషయంలో భిన్నాభి ప్రాయలు కలిగి ఉన్నారు.
– పొట్టేలు ఖుర్బానీ ఉత్తమమైనదనీ కొందరి అభిప్రాయం. ”ప్రవక్త (స) ప్రతి సంవత్సరం పొట్టేలు ఖర్బానీ ఇచ్చారు” అన్నది వీరి ఆధారం.
– అధిక శాతం పండితులు పశువు విలువ, మాంసము, మరియు ఇతర ప్రయోజనములను దృష్టిలో ఉంచుకొని ఈ క్రమపద్ధతిని తెలిపారు:
(1) ఒంటె ఒక్కరి తరపున ఇవ్వబడితే ఉత్తమమైనది.
(2) ఆవు ఒక్కరి తరపున ఇవ్వబడితే ఉత్తమమైనది.
(3) పొట్టేలు, గొర్రె, మేక, పోతు వీటిలో ఏదైనా ఒక్కరి తరపున ఇవ్వబడితే.
(4) ఒంటె కొందరు వ్యక్తులు కలిసి ఇస్తే.
(5) ఆవు కొందరు వ్యక్తులు కలిసి ఇస్తే.(ఫతావా ఇస్లామీయ 2/320)
ఖుర్బానీ పశువులో భాగాలు, భాగస్తులు:
స్థోమత ఉన్నవారు ఒక పశువు ఒంటె, లేక ఆవు, లేక పొట్టేలు వీటిలో ఏదైనా ఒకటి ఒకే మనిషి తరపున ఖుర్బానీ ఇవ్వడం ఉత్తమం.
ఒక ఒంటెనుగాని, ఆవును గాని, పొట్టేలుని గాని ఇంటి యజమాని తన కుటుంబీకుల తరపున ఖుర్బానీ ఇవ్వచ్చు.(తిర్మిజి,ఇబ్నెమాజ)
వివరణ: ఒక కుటుంబం అంటే; అందరి పోషణా బాధ్యత ఒకే వ్యక్తిపై ఉంటుంది.
ఇక పోతే అన్నదమ్ములూ వారందరి సంపాదన వేరు. పొదుపు వేరు. వారిలోని ప్రతి ఒక్కరూ తమ భార్యాబిడ్డల్ని పోషణా బాధ్యతను స్వయంగా నిర్వర్తిస్తున్నారు. అందరూ కలిసి తల్లిదండ్రుల దగ్గర పండుగ జరుపుకుంటే ఒకే కుటుంబంగా పరిగణించ బడినప్పటికీ, అందరి సంపాదన, పొదుపు, ఖర్చులు వేరువేరుగా ఉండటం వలన ప్రతి ఒక్కరిపై ఖుర్బానీ వాజిబ్ అవుతుంది.
అతా బిన్ యసార్ (ర) ఇలా తెలియజేసారు:
నేను అబూ అయ్యూబ్ అన్సారీ (రజి) తో ప్రవక్త (స) కాలంలో ఖుర్బానీ ఎలా చేయబడేదని అడిగాను? ప్రతి మనిషి తన తరపున తన కుటుంబీకుల తరపున ఒక మేక ఖుర్బానీ ఇచ్చేవాడు. ప్రజలు స్వయంగా తిని
ఇతరులకు కూడా తినిపించేవారని ఆయన బదులిచ్చారు. (తిర్మిజి)
ఒక కుటుంబ యజమాని తన తరపున తన కుటుంబీకుల తరపున ఒక పశువును ఖుర్బానీ ఇచ్చినచో ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తి తన పేరిట ప్రత్యేకంగా ఒక పశువుని ఖుర్బానీ చేయడం వాజిబ్(తప్పనిసరి)కాదు.
ఇమామ్ షౌకానీ (ర) ఇలా తెలియజేసారు: వాస్తవమేమిటంటే ఒక్క మేక పూర్తి ఒక కుటుంబం తరపున సరిపోతుంది, బహుశా ఆ ఒక కుటుంబం 100 మంది వ్యక్తుల్ని కలిగి ఉన్నా సరే. (నైలుల్ ఔతార్ 5/143)
ఒక సంవత్సరం తన పేరిట మరో సంవత్సరం తల్లి పేరిట ఆ తర్వాత తండ్రి పేరిట ఆపై భార్య, కుమారుడు, కుమార్తె అంటూ ఒక్కో సంవత్సరం ఒకరి పేరిట మాత్రమే ఖుర్బానీ ఇచ్చి అదే కుటుంబానికి చెందిన ఇతరులు స్థోమత ఉండి కూడా ఖుర్బానీకి దూరంగా ఉండటం ప్రవక్త (స) నేర్పిన విధానానికి విరుద్ధమైన అలవాటని గ్రహించాలి. పూర్తి కుటుంబం తరపున పశువు ఖుర్బానీ ఇవ్వాలన్న విషయం మరవరాదు.
ప్రత్యేకంగా ఒక పశువుని ఖుర్బానీ ఇచ్చే స్థోమత లేనివారు 10 లేక 7 మంది కలిసి ఒక ఒంటెను ఖుర్బానీ ఇవ్వవచ్చు.
7 మంది కలిసి ఒక ఆవును ఖుర్బానీ ఇవ్వవచ్చు.
7 కుటుంబాల తరపున ఒంటెను గానీ ఆవును గానీ ఖుర్బానీ ఇవ్వవచ్చును.(ముస్లిం)
పొట్టేలు, గొర్రె, మేక, పోతు వీటిలోని ఏ ఒక దానిని ఒకటి కంటే ఎక్కువ కుటుంబాల తరపున ఖుర్బానీ చేయరాదు.(పాన్చ్ అహమ్ దీనీ మసాయిల్ 76)
ఖుర్బానీ మరియు అఖీఖా రెండింటి సంకల్పంతో ఒకే పశువుని జిబహ్ \చేయటం ప్రవక్త (స) విధానానికి విరుద్ధం. పశువు ఖుర్బానీ చేయటానికి బదులు దాని విలువను నిరుపేదలకు పంచిపెట్టడం ఉత్తమం అనుకోవడం సరికాదు. పశువును ఖుర్బానీ చేయడమే ఉత్తమం. ఇదే ప్రవక్త (స) విధానం అనే విషయాన్ని గ్రహించాలి.
లోపాల నుండి సురక్షితంగా ఉన్న పశువును ఖుర్బానీ కోసం కొన్న తరువాత దానిలో ఏదైనా లోపం కలిగితే ఆ పశువును ఖుర్బానీ చేయటం ధర్మసమ్మతమే.(అల్‌ముఫస్సల్76) అయితే స్థోమత గల వ్యక్తి పశువును మార్చు కుంటే మంచిది. వివరణ: అబ్దుల్లాహ్‌ా బిన్ జుబైర్ (ర) (ఒక చోట ఖుర్బానీ కోసం ఉంచబడిన) ఒంటి కన్ను ఒంటెను చూచి ఈ ఒంటె కొన్న తరువాత ఒంటి కన్నుదైపోయి ఉంటే దీనిని ఉంచండి, ఒకవేళ కొనక ముందే ఒంటి కన్నుదై ఉంటే దీన్ని మార్చేయండి అన్నారు. (బైహఖీ – ఖుర్బానీ వ ఈదైన్ 65)
ఖుర్బానీ కోసం కొన్న పశువును ఎలాంటి లోపం లేకున్నా అకారణంగా మార్చడం సరికాదు. అయితే కొన్న పశువు కంటే మంచిది మరొకటి కొనడానికి అలా చేస్తే అభ్యంతరం లేదు. (అల్ ముఫస్సల్ 147)
ఖుర్బాని కోసం కొన్న పశువు తప్పి పోయి కనిపించకపోయినా లేదా మరణించినా స్థోమత గల వ్యక్తి మరో పశువుని కొని ఖుర్బానీ చేయాలి. ( అల్ ముఫస్సల్ 119)
గర్భంలో ఉన్న పశువును ఖుర్బానీ చేయవచ్చు (అబూ దావూద్)
ఖుర్బానీ కోసం కొన్న పశువు ఖుర్బానీ ముందు పిల్లను/దూడను కంటే ఖుర్బానీ నాడు తల్లీ బిడ్డ రెండింటినీ ఖుర్బానీ చేయాలి. ఇది ఒక ఖుర్బానీ గానే పరిగిణించబడుతుంది.(బైహఖీ, అల్‌ముఫస్సల్ – 135)
ఖుర్బానీ చేయవలసిన సమయం:
జుల్ హిజ్జ మాసపు 10వ తేదీ అనగా పండుగనాడు, పండుగ నమాజు తరువాత నుండి ఖుర్బానీ చేయవలసిన సమయం మొదలౌతుంది. ఇదే ఖుర్బానీ చేయవలసిన ఉత్తమమైన సమయం.(బుఖారీ, ముస్లిం)
పండుగ నమాజుకు మునుపే పశువును ఎవరైన జబహ్ చేసినచో అది ఖుర్బానీగా పరిగణించబడదు. ఖుర్బానీ కొరకు ఆ వ్యక్తి మరొక పశువును పండుగ నమాజు తర్వాత జబహ్‌ా చేయాలి. (బుఖారీ, ముస్లిం)
జుల్ హిజ్జ పండుగ నమాజు తరువాత నుండి 13 జుల్ హిజ్జ సూర్యాస్తమయం వరకు రేయింబవళ్ళు ఎప్తుడైనా ఖుర్బానీ చేయవచ్చు. (అహ్మద్, ఇబ్నె హిబ్బాన్)
ఖుర్బానీ చేసే విధానము:
జిబహ్ చేసే ముందు కత్తిని బాగా పదును పెట్టాలి (ముస్లిం)
జంతువు ముందు కత్తి నూర రాదు.(బైహఖీ)
పశువును జబహ్ చేయుట కొరకు ఎడమ వైపునకు పరుండ బెట్టవలెను. (బుఖారీ)
(ఇలా చేస్తే కుడిచేత్తో కత్తి మరియు ఎడమ చేతితో జంతువు తలను పట్టుకొనుటకు వీలు కుదురుతుంది.)
ఆవు, మేక,గొర్రె, పోతు, పొట్టేలు లను పడుకోబెట్టి జిబహ్ చేయవలెను. ఒంటెను నిలబెట్టి ‘నహర్’ చేయవలెను.(బుఖారీ, అల్ హజ్ 36)
పశువును ఖిబ్లా వైపు తిప్పి జబహ్‌ా చేయాలి. జబహ్‌ా చేసే వ్యక్తి కూడా ఖిబ్లా వైపు మొహం చేసి జబహ్‌ా చేయాలి. (అబూ దావూద్)
జబహ్‌ా చేసే వ్యక్తి తమ కాలును పశువు పైభాగాన ఉంచవచ్చు. (బుఖారి)
జబహ్ చేసేటప్పుడు పూర్తి శక్తిని ఉపయోగి స్తూ తొందరగా జిబహ్‌ా చేయాలి.(ముస్లిం)
ఖుర్బానీ ఇస్తున్న వ్యక్తి (జబహ్ చెయ్యటం తెలిసినట్లయితే) తమ స్వహస్తాలతో ఖుర్బానీ చేయడం ఉత్తమం. (బుఖారీ)
జబహ్‌ా చేయుటకు ఇతరుల సహకారం తీసుకోవచ్చు. (బుఖారీ)
ఇతరుల చేత జబహ్‌ా చేయించుకునే అనుమతి ఉంది. (ముస్లిం)
మహిళలు కూడా జబహ్‌ా చేయవచ్చు. (బుఖారీ)
పశువును జబహ్‌ా చేస్తున్నపుడు ”బిస్మిల్లాహి అల్లాహు అక్బర్” తో పాటు ”అల్లాహుమ్మ ఇన్న హాదా మిన్‌క వ లక, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నా” అని కూడా చదవ వచ్చును. (ముస్లిం, అబూ దావూద్)
”ఇన్నీ వజ్జహ్‌తు వజ్‌హియ లిల్లదీ…..” పూర్తి దుఆ కూడా చదవ వచ్చునని కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది. (అన్‌ఆమ్ 162-162, అబూ దావూద్)
జబహ్‌ా చేసే సమయాన జంతువు అదుపు తప్పి తప్పించుకొని పరుగులు తీస్తే షికారు చేసే విధానంలా దాని శరీరానికి ఎక్కడైనా (అల్లాహ్‌ా పేరు స్మరించి) గాయపరచవచ్చు. అందులోనే అది ప్రాణం వదిలితే అది హలాల్ గానే పరిగణించబడుతుంది. ఒకవేళ ప్రాణాలతో దొరికితే తప్పనిసరిగా జబహ్ చేయాలి.
ఖుర్బానీ మాంసము మరియు చర్మము:
ఖుర్బానీ మాంసము స్వయంగా తినవచ్చు, ఇతరులకు తినిపించవచ్చు మరియు భద్ర పరుచుకోవచ్చు. (బుఖారీ)
అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”వాటిని మీరు తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్య పరులకు కూడా తినిపించండి.”(హజ్;36) ఈ వాక్యం ఆధారంగా కొంతమంది పండితులు ఖుర్బానీ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఒక భాగం ఖుర్బానీ ఇచ్చిన వారి కోసం.
రెండవ భాగం యాచకులకు, నిరుపేదలకు, అగత్యపరుల కోసం.
మూడవ భాగం తమను కలుసుకునే బంధు మిత్రులకు, ఇరుగుపొరుగు వారికోసం. ఇలా మూడు భాగాలుగా ఖుర్బానీ మాంసాన్ని విభజించటం ఉత్తమమైన విధానం ”వాజిబ్” తప్పనిసరి కాదు.
ఖుర్బానీ మాంసం ముస్లిమేతరులకు కూడా ఇవ్వవచ్చు. (అల్ ముఫస్సల్ 139)
ఈదుల్ అజ్‌హా నాడు పండుగ నమాజు అనంతరం తోలుత ఖుర్బానీ మాంసం భుజించడం ప్రవక్త (స) విధానము. (ముస్లిం)
ధర్మసమ్మతమైన పశువు రక్తం మినహా మిగతావన్నీ ధర్మసమ్మతమైనవే.(మాయిద:3)
ఖుర్బానీ పశువు చర్మము స్వయంగా ఉపయోగించవచ్చు, లేదా ఇతరులకు దానం చేయవచ్చు. చర్మం వలిచే వ్యక్తికి కూలీగా మాత్రం ఇవ్వరాదు. (బుఖారీ, ముస్లిం)
చర్మం వలిచిన వ్యక్తికి (జబహ్ చేసిన వ్యక్తికి) ఇతరులకు మాంసం పంచినట్లు వీరికి కూడా ఇవ్వవచ్చు, కానీ జబహ్‌ా చేసినందుకు మరియు చర్మం వలిచినందుకు ప్రత్యేక మోతాదులో మాంసం ఇవ్వటం సమంజసం కాదు.
ఖుర్బానీ చర్మం అమ్మి సొమ్ము చేసుకో కూడదు. (హాకిం) ఒక వేళ అమ్మినా వచ్చిన మొత్తాన్ని సద్‌ఖా చేయవలెను.
మరణించిన వ్యక్తి పేరిట ఖుర్బానీ చేయటం:
మరణించిన వ్యక్తి పేరిట ఖుర్బానీ చేయడం అనే అంశంపై ధార్మిక పండితులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు.
(1) బలహీనమైన హదీసులను ఆధారంగా తీసుకున్నందువలన, లేదా మరణించిన వ్యక్తి పేరిట ఇది కూడా ‘సద్‌ఖా” దానం అని భావించటం వలన మరణించిన వ్యక్తి పేరిట ఖుర్బానీ చేయవచ్చని కొందరు ధార్మిక పండితులు అభిప్రాయపడ్డారు.
(2) మరణించిన వ్యక్తి మరణానికి ముందు తన కుటుంబంలో ఎవరికైనా ‘వసియత్’ చేసి ఉంటే అలాంటప్పుడు మరణించిన వ్యక్తి పేరిట ఖుర్బానీ చేయవచ్చని షరతు విధిస్తారు మరికొంత మంది ధార్మిక పండితులు.
(3)మరణించిన వ్యక్తి పేరిట ప్రత్యేకంగా ఒక పశువుని జబహ్‌ా చేయరాదు, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్(స) బ్రతికుండగా వారి సతీమణి ఖదీజ (ర) మరియు ముగ్గురు కుమార్తెలు జైనబ్, రుఖయ్య,ఉమ్మెకుల్సూమ్,
మరియు పినతండ్రి హంజా (ర) మరణించారు. కాని ప్రవక్త (స) వారెవరి పేరిట ఏ ఒక్క సంవత్సరం ఒక పశువునూ ఖుర్బానీ చేయలేదు.
అయితే నా తరపున నా కుటుంబీకుల తరపున అని ఒక పశువుని ఖుర్బానీ ఇస్తే ఇన్షాఅల్లాహ్‌ా ఖుర్బానీ ఇస్తున్న వ్యక్తికీ, బ్రతికున్న అతని కుటుంబీకులతో పాటు మరణించిన అతని కుటుంబీకులకు కూడా పుణ్యం లభిస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ (స) కూడా ఇలాగే చేసేవారు. ఒక పొట్టేలును ఖుర్బానీ చేస్తూ ‘ఓ అల్లాహ్‌ా ఇది నా తరపున నా కుటుంబీకుల తరపున స్వీకరించు’ అని ప్రార్థిస్తూ చేసేవారు.
కావున మరణించిన తమ కుటుంబీకులకు పుణ్యం చేకూర్చాలనుకునే వారు ప్రవక్త (స) లాగే వారి విధానాన్ని అనుసరించి ఒక పశువుని తన తరుపున తన కుటుంబీకుల తరుపున ఖుర్బానీ ఇచ్చుకోవాలి. ప్రవక్త (స) విధానానికి వ్యతిరేకంగా మరణించిన వారి పేరిట ప్రత్యేకంగా పశువు ఖుర్బానీ చేసే అనుమతి లేదని ధార్మిక పండితుల అభిప్రాయం. (అల్లాహు ఆలమ్)
ముఖ్య విషయాలు:
ఖుర్బానీ విశిష్ఠత గురించి వచ్చిన ఉల్లేఖనా లలో అధిక శాతం బలహీనమైనవి. (తొహ్‌ాఫ తుల్ అహ్‌ావజీ 5/63)
అలా అనీ ఖుర్బానీ ఇస్లామీయ సంప్రదాయం కాదని, చెప్పరాదు. ఖుర్బానీ చేయడం అల్లాహ్‌ా ఆదేశం మరియు ప్రవక్త (స) విధానం. దీనిపై అమలు చేయడంలో తప్పని సరిగా ఒకటికి ఏడువందల రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. కానీ బలహీనమైన ఉల్లేఖనాలను ప్రసంగిస్తూ, వాటిని నమ్ముతూ లేక వాటిపైనే ఆధారపడుతుంటారు. కావున గమనించాలని విన్నవించుకుంటున్నాము.
తప్పనిసరి కాకపోయినా అప్పు చేసి మరీ ఖుర్బానీ చేయడం మంచిదని ఇమామ్ ఇబ్ను తైమియా (ర) అభిప్రాయపడ్డారు. (ఖుర్బానీ వ ఈదైన్ -మునీర్ ఖమర్ 75)
అప్పు చేసి మరీ ఖుర్బానీ చేయడం తప్పని సరి కాదనే ఒక్క కారణంతో అనేక మంది అప్పు తీర్చుకునే స్థోమత ఉండి కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేసే ఈ పుణ్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎలాంటి పుణ్యం లభించని అనేక ప్రాపంచిక విషయాల కోసం మాత్రం నిర్భయంగా అప్పులు చేసి కోరికలు
తీర్చుకుంటుంటారు. మరి ఇలాంటి విధానము భక్తునికి తగునా? ఆలోచించండి !
అజ్‌హా పండుగ విషయాలు:
పండుగ నాడు గుసుల్ (స్నానం) చేయడం, సువాసనలు పూసుకోవటం, మంచి బట్టలు ధరించటం ప్రసంశనీయం.(ఇబ్నుమాజ, బుఖారి)
పండుగ నమాజు ”ఈద్‌గాహ్” లో చదువ వలెను. (బుఖారీ)
మహిళలు, పిల్లలు కూడా ఈద్‌గాహ్ వెళ్ళాలి బహిష్టు స్థితిలో ఉన్న మహిళలు కూడా వెళ్ళాలి కాని నమాజు చదవరాదు, దుఆ లో పాల్గొనవచ్చును. (బుఖారీ, ముస్లిం)
అద్‌హా పండుగ నమాజు ఈదుల్ ఫితర్ నమాజుకంటే త్వరగా ముగించాలి. (బుఖారీ, అబూదావూద్)
9వ జుల్ హిజ్జ – అరఫా నాడు ఉదయం నుండి 13 జుల్ హిజ్జ సూర్యాస్తమయం వరకు తక్బీర్లు చదవు వలెను.(హాకిమ్, ముసన్నఫ్ ఇబ్నె అబీ షైబా)
పండుగకు ఒకదారి గుండా వెళ్తే, తిరిగి వచ్చేటప్పుడు మరొక దారి గుండా రావాలి. (బుఖారీ)
పండుగ నమాజు కొరకు అజాన్, ఇఖామత్ చెప్పనవసరం లేదు. (ముస్లిం)
పండుగ నమాజులో 12 తక్బీర్లు అదనంగా పలుకబడతాయి. మొదటి రకాతులో ఫాతిహా కి ముందు 7 తక్బీర్లు, మరియు రెండవ రకాతులో ఫాతిహా కి ముందు 5 తక్బీర్లు పలుకవలెను.
పండుగ నమాజులోని మొదటి రకాతులో సూర ఆలా, రెండవ రకాతులో సూర గాషియా దచవాలి, లేదా మొదటి రకాతులో సూర ఖాఫ్ రెండవ రకాతులో సూర ఖమర్ చదవాలి. (ముస్లిం)
పండుగ నాడు మరియు 11,12,13 జుల్ హిజ్జ తేదీలలో ఉపవాసం ఉండరాదు. (బుఖారీ, అబూదావూద్)
అజ్‌హా పండుగ నాడు ఈద్గాహ్ ఏమి తినకుండా తక్బీర్లు పఠిస్తూ వెళ్ళాలి.(అల్లాహు అఅలమ్)