రమజాను

islamic-wallpaper-islam-wallpaper-11

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

ప్రశ్న: రమజాను నెలలో – ఉపవాస స్థితిలో – ఉపవాసికి వీర్యస్ఖలనం (ఇహ్తిలామ్‌) జరిగినట్లయితే, అతని ఉపవాసం (రోజా) భంగమవుతుందా? లేదా? అతను వెంటనే స్నానం చేయాలా?
జవాబు: వీర్య స్ఖలనం వల్ల ఉపవాసం భంగమవదు. ఎందు కంటే ఇది ఉపవాసి నియంత్రణలో లేని విషయం. అయితే వీర్య స్ఖలనం జరిగినప్పుడు మాత్రం స్నానం (గుసుల్‌) చేయటం తప్పనిసరి.

ఒకవేళ ఫజ్ర్‌ నమాజ్‌ తర్వాత వీర్యస్ఖలనం జరిగితే జుహ్ర్‌ నమాజ్‌ వేళ వరకు స్నానాన్ని వాయిదా వేసినాసరే ఉపవాసానికి ఎలాంటి దోషం ఏర్పడదు… అలాగే రాత్రి పూట భార్యతో సమాగమం జరిపి, ఉషోదయం అయినప్పుడు స్నానం (గుసుల్‌) చేసినా కూడా దోషం లేదు. ఎందుకంటే ఈ విషయం మహా ప్రవక్త (స) ద్వారా నిరూపితమై ఉంది. ఆయన (స) లైంగిక అశుద్ధావస్థలో తెల్లవార్చి (ఫజ్ర్‌ నమాజు ముందు వరకు), స్నానం చేసి ఉపవాసం పాటించిన సందర్భాలున్నాయి.

రుతుస్రావానికి, పురిటి రక్త స్రావానికి లోనైవున్న స్త్రీలకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. రాత్రి బహిష్టు ఆగిపోయిందని (పరిశుద్ధత లభించిందని) నిర్ధారణ అయినట్లయితే, రోజా సంకల్పం చేసుకుని తెల్లవారాక స్నానం చేసినా ఫరవాలేదు – అట్టి పరిస్థితిలో వారి ‘రోజా’కు ఎలాంటి విఘాతం కలగదు. కాని వీరైనా, సంభోగ అశుద్ధావస్థలో ఉన్నవారైనా ఉద్దేశ్యపూర్వకంగా స్నానానికి, ఫజ్ర్‌ నమాజుకు ఆలస్యం చేయటం మాత్రం సమ్మతం కాదు. పైగా ఇలాంటివారంతా స్నానం చేసి పరిశుద్ధత పొందటానికి వేగిరపడాలి. ఫజ్ర్‌ నమాజును వేళకు చేయాలి – ఇది తప్పనిసరి.
స్వప్న స్ఖలనం జరిగినా, రక్తస్రావం జరిగినా వాంతి అయినా ఉపవాసం భంగమవుతుందా? – ఎం.వి.ఎ
ప్రశ్న: (అ) నేను ఉపవాసం ఉన్న స్థితిలో మస్జిద్‌లో నిద్రపోయాను. తీరా నాకు మెలకువ వచ్చినమీదట తెలిసింది – నాకు స్వప్న స్ఖలనం జరిగిందని. నేను స్నానం చేయకుండానే నమాజు చేశాను. దీనివల్ల నా నమాజుకు, రోజాకు ఏమైనా హాని కలుగుతుందా?
(ఆ) ఒకసారి ఉపవాస స్థితిలో నా తలకు రాయి తగిలి రక్తం స్రవించింది. తత్కారణంగా నా ఉపవాసం భగ్నమయిందా?
(ఇ) అదేవిధంగా దానంతట అదే అయ్యే వాంతి వల్ల రోజాకు ఏమైనా నష్టం జరుగుతుందా? దయచేసి నా సందేహాలు తీర్చగలరని ఆశిస్తాను.
జవాబు: (అ) స్వప్న స్ఖలనం వల్ల ఉపవాసం భగ్నమవదు. ఎందుకంటే అది మీ అదుపులో లేని విషయం. కాని అంగం నుండి వీర్యం స్ఖలించబడినట్లు నిర్ధారణ అవుతే మాత్రం స్నానం చేసి పరిశుద్ధతను పొందవలసిందే. ఇది తప్పనిసరి. ఎందుకంటే ఒక సందేహానికి దైవప్రవక్త (స) ఇచ్చిన సమాధానం ద్వారా ఇది తప్పనిసరి (వాజిబ్‌) అని స్పష్ట మవుతోంది. ఇకపోతే, మీరు స్నానం చేయకుండానే నమాజు చేశానంటున్నారు. ఇది తప్పు. కాబట్టి మీరు ఆ నమాజును తిరిగి చేయటంతోపాటు క్షమాపణకై అల్లాహ్‌ాను వేడుకోవాలి.
(ఆ) తలకు రాయి తగిలి, రక్తం స్రవించటం వల్ల మీ ఉపవాసానికి ఎలాంటి విఘ్నం కలగదు.
(ఇ) ఇక దానంతట అదే అయిపోయిన వాంతి గురించి. అందులో కూడా మీ ప్రోద్బలం ఏమీ లేదు గనక మీ ‘రోజా’కు ప్రమాదం వాటిల్లదు. ఎందుకంటే మహనీయ ముహమ్మద్‌ (స) ఇలా ప్రవచించారు:
”ఎవరికయితే అప్రయత్నంగా వాంతి జరిగిందో వారు తమ ఉపవాసాన్ని ‘ఖజా’ చేసుకోవలసిన అవసరం లేదు. మరెవరయితే బలవంతంగా వాంతి చేశారో, వారు ఉపవాసాన్ని ఖజా చేసుకోవాలి. (తిరిగి రోజా పాటించాలి)”.
ఈ హదీసును ‘అహ్మద్‌’తో పాటు సునన్‌ ప్రభృతులంతా ప్రామాణిక సనదులతో పొందుపరిచారు.

ఫిత్రా దానం ఎంత?
– మర్యం
ప్రశ్న: సదఖతుల్‌ ఫిత్ర్‌ (ఫిత్రా దానం) ఎంత ఇవ్వాలి?
జవాబు: ఇది ఆయా ప్రాంతం లేక పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను, వారు తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా ప్రజలు తాము తినే ఆహార ధాన్యాలను ‘ఫిత్రా దానం’గా ఇవ్వాలి. ఒక ఫిత్రా పరిమాణం ‘ఒక సా’ (అంటే దాదాపు 3 కిలోలు) – అది గోధుమలైనా కావచ్చు, బియ్యమైనా కావచ్చు, ఖర్జూర పండ్లయినా కావచ్చు – మరే ధాన్యమైనా కావచ్చు. ప్రతి ముస్లిం తరఫున ఈ సదఖతుల్‌ ఫిత్ర్‌ చెల్లించవలసిందే – వారు పురుషులైనా, స్త్రీలయినా, చిన్నవారైనా, పెద్దవారైనా, యజమానులైనా, సేవకులైనా – అందరి తరఫున పండుగ నమాజు చేయకముందే ఈ దానం ఇవ్వాలని మహా ప్రవక్త (స) హదీసుల ద్వారా రూఢీ అవుతున్నది. పండుగకు ఒకట్రెండు రోజులు ముందే చెల్లించినా ఫరవాలేదు.

Related Post