మౌలానా అబ్దుల్ ఖాదిర్ ఉమ్రీ
ప్రతి మనిషి సహజంగా సాఫల్యాన్ని కాంక్షిస్తాడు. విజయాన్ని సాధిం చాలనుకుంటాడు. అయితే సాఫల్యం, సిసలయిన సాఫల్యం అంటే ఏమిటి? కొందరు డబ్బు, హోదా, అంతస్తు, పలుకుబడిని విజయానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి వారు లేని వారిని, లేమి గురయి ఉన్న వారిని, శ్రామికుల్ని చులకన చేసి మాట్లాడుతారు.
దివ్య ఖుర్‌ఆన్‌లో ఫిర్‌ఔన్, హామాన్, ఖారూన్, అబూ లహబ్‌ల ప్రస్తా వన వచ్చింది. వారు అధికార అందలమెక్కివారు, కోట్లకు పడగలెత్తిన కుబేరులు. సమాజంలో పలుకుబడి ఉన్నవారు. అయితే తమలోని మహత్తు గొప్పదని ఎంచి, తమ సత్తాకు తామే మతక్కి, కళ్ళు పైకెక్కి నిజ దైవాన్ని, ఆయన ఆదేశాల్ని పెడ చెవిన పెట్టారు. అత్యాచారాల కు, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఫలితంగా దైవాగ్రహానికి గుర య్యారు. ఇహపరాల్లో కోరి వినాశనాన్ని తెచ్చి పెట్టుకున్నారు. కనుక ప్రాపంచిక జీవితంలో ఆస్తిపాస్తులు, ఆలుబ్డిలు, పదవులు, పలుకు బడులు కలిగి ఉండటం మాత్రమే విజయానికి కొలమానం కాదు. అలా భావించడం విశ్వాసులకు ఏ మాత్రం తగదు. అలాగే కష్టాలకు, నష్టాలకు, లేమికి, దారిద్య్రానికి గురయి జీవిస్తున్నవారు వైఫల్యం చెందారని, దురదృష్టవంతులని కూడా కాదు. ”ఈ ప్రాపంచిక జీవిత మయితే కేవలం ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు”. (దివ్య ఖుర్‌ఆన్-87:15) సాఫల్యం – కలిమిలోనూ, లేమిలోనూ, సర్వకాల, సర్వావస్థల్లోనూ దైవభీతి కలిగి జీవించడమే, జీవితపు అన్ని అంగాల్లోనూ, అన్ని రంగాల్లోనూ దైవాదేశాలకు లోబడి నడచుకోవ డమే. ఒక్క మాటలో చెప్పాలంటే అల్లాహ్‌ా కొందరిని అపారంగా అనుగ్రహించి పరీక్షిస్తాడు, మరికొందరిని కటిక దారిద్య్రానికి గురి చేసి పరీక్షిస్తాడు. ఆయన పెట్టిన ఈ పరీక్షలో ఉత్తీర్ణులయిన వారిదే సిసలయిన సాఫల్యం. వారే నరకాగ్ని నుండి కాపాడ బడి స్వర్గప్రవేశం చేసే అసలయి విజేతలు.
మనమూ అట్టి సాఫల్యాన్ని మూట కట్టుకోగలము. కానీ ఎప్పుడు? మన ఆంతర్యాన్ని బహుదైవోపాసన కాలుష్యం నుండి, పాపిష్టికర మయిన ఆలోచనల నుండి, ఆసూయాద్వేషాల నుండి, ఆత్యాశ పేరా శల నుండి, ప్రతీకారాగ్ని జ్వాలల నుండి, అధికారవాంఛ, ఐహిక లాలస నుండి, కనక వ్యామోహం నుండి, కాంతాదాస్యం నుండి ప్రక్షా ళనం చేసుకున్నప్పడు. ”అవును నిశ్చయంగా తన ఆత్మను ప్రక్షాళనం చేసుకొని, తన ప్రభువు నామాన్ని స్మరించిన వాడు, నమాజు ఆచరిం చిన వాడు సాఫల్యం పొందుతాడు”. (దివ్యఖుర్‌ఆన్- 87:14-15)
సిసలయిన సాఫల్యం సొంతమవుతుంది. ఎప్పుడయితే మనం అనుక్ష ణం అల్లాహ్‌ాకు భయపడుతూ, మన మనసును, మస్తిష్కాన్ని, మన మాటను, బాటను, నడకను, నడవడికను నిషిద్ధ విషయాల నుండి కాపాడుకుంటూ, ధర్మపథంలో మన జీవన రథాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తామో అప్పుడు. ”మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమయి భయ పడ్డాడో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గం అవుతుంది”.
(దివ్యఖుర్‌ఆన్-79:40-41)
మనకు వాస్తవ విజయం వరిస్తుంది. ఎప్పుడయితే మనం కేవలం అల్లాహ్ ప్రీతిని కోరుతూ బడుగు, బలహీన ప్రజల పట్ల, అభాగ్యుల పట్ల, అనాథల పట్ల, వితంతువుల పట్ల, వికలాంగుల పట్ల దయ, జాలి, కరుణ కలిగి వ్యవరిస్తామో అప్పుడు. ”వారు అల్లాహ్‌ా ప్రీతి కోసం నిరుపేదలకు, అనాథలకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు.
(పైగా వారిలా అంటారు): మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము. అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతి ఫలాన్ని గానీ, కృతజ్ఞతల్ని గానీ ఆశించడం లేదు. నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫు నుండి సంభవించబోయే అత్యంత కఠినమయిన, సుదీర్ఘమయిన రోజు గురించి భయపడుతున్నాము. అందు వల్ల అల్లాహ్ వారిని ఆనాటి కీడు నుండి రక్షించి, వారికి ఉల్లాసాన్ని, ఆహ్లా దాన్ని వొసగాడు. వారి సహనానికి బదులుగా వారికి స్వర్గాన్ని, పట్టు వస్త్రాలను ప్రసాదించాడు”. (దివ్యఖుర్‌ఆన్-76:8-12)
హజ్జ్ మహారాధన మనిషి మారడానికి, ఆత్మ ప్రక్షాళనకు, వ్యక్తుల సంస్కరణకు, ఉత్తమ సమాజ నిర్మాణానికి ఎంతో దోహద పడుతుంది. ఈ వాస్తవాన్ని ముస్లిం సమాజం గుర్తించి మసలుకున్న నాడు, నేడు వారు ఎదుర్కొంటున్న అస్థిరత, అశాంతి, ఆసౌకర్యం తొలిగి శాంతి సుస్థిరతలు ప్రాప్తిస్తాయి. ఇహపరాల్లో కీర్తి ఒనగూడుతుంది. ”మీలో ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో,వారికి అల్లాహ్‌ా వారి పూర్వీ కుల్ని భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కుడా తప్పకుండా ప్రాతినిధ్యం వొసగుతానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదిం చిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తా నని, వారికున్న భయాందోళనల స్థానే శాంతిభధ్రతల స్థితి కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు”. (అన్‌నూర్:55)
అల్లాహ్ అందరికీ ఆయన ఆదేశాలకనుగుణంగా నడుచుకుని ఆయన అపార అనుగ్రహాలకు ఆలయమయిన స్వర్గధామంలో ప్రవేశం కల్పిం చాలని మనసారా వేడుకుందాం!