షేక్ అబ్దుల్ ఖాదిర్ ఉమ్రీ
మనిషి సంఘజీవి. ఒంటరిగా బ్రతకలేడు. ఉదయం నిద్ర లేచిన ప్పటి నుంచి మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమిచేంత వరకూ ఏదో ఒక పనిలో నిమగ్నుడయి ఉంటాడు. ఎవరో ఒకరి సహాయం అందు కంటూనే ఉంటాడు. అలా అందే సహాయాల్లో స్నేహ హస్తానికి అగ్ర పీఠం అనే చెప్పాలి.
స్నేహం-అది ప్రకృతి అంత సహజమయినది. స్నేహం – అది నవ్వు తుంది, నవ్విస్తోంది. స్నేహం-ఏడిపిస్తుంది, ఓదారుస్తుంది. స్నేహం- అది నడుస్తుంది, నడిపిస్తుంది, నడక నేర్పిస్తుంది, నడవడిక సరి చేస్తుంది, అడుగడులు తడబడినప్పుడు తోడ్పాటునందిస్తుంది, తప్పట డుగులు వేస్తున్నప్పుడు మందలించి మరి దారికి తెస్తుంది. మన ఆశలు, ఆశయాలకు, మార్గధర్శకాలను ఏర్పర్చడంలో స్నేహం పాత్ర కీలకం. స్నేహం-అది తల్లితో కావచ్చు. తండ్రితో కావచ్చు, గురువు తో కావచ్చు, సోదరులతో కావచ్చు, సతితో కావచ్చు, సంతానంతో కావచ్చు,లేదా సాక్షాత్ పరమోన్నత మిత్రుడయిన అల్లాహ్‌ాతో కావచ్చు. ఆంగ్లంలో ఓ సామెతుంది: ”ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్- కష్టాల్లో తోడు నిలిచి తోడ్పాటునందించేవాడే నిజమయిన స్నేహి తుడు”.ఒక్క మాటలో చెప్పాలంటే, స్నేహ్నం-పసిపాప వంటిది. గారా బంతో పాడు చేయకుండా అదుపులో ఉంచుకోవలసినది. స్నేహం- పాల వంటిది..జాగ్రత్తగా చూసుకోకపోతే పొంగిపోయే, ఇరిగిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. సేహ్నం-దాన్ని సజావుగా సద్వినియోగ పరచుకుంటే రక్ష, లేదా శిక్ష. ఈ కారణంగానే ప్రవక్త శ్రీ (స) అన్నారు: ”మనిషి తన స్నేహితుని మతధర్మం మీదనే ఉంటాడు. కాబట్టి ఎవరితో స్నేహం చేయాలో బాగా తర్కించి చేయాలి”.(అహ్మద్)
స్నేహం – అది ప్రకృతి అంత నిర్మలమయినది, అయినా అందులో కోపతాపాలు, కొట్లాడుకోవడాలు, కలిసిపోవడాలు, మొహమాటలు, మంకుతనాలు, మర్యాదలు, గౌరవాలు, మన్ననలు, మోసాలు, సత్కారాలు, తస్కారాలు…అన్నీ ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భం గా స్నేహానికి ప్రవక్త (స) వారు ఇచ్చిన ఉదాహరణ గమనార్హం. ఆయన అన్నారు: ”మంచి మిత్రుని ఉపమానం అత్తరు అంగడి వాని వంటిది. అతను బహుమానంగా అత్తరయినా ఇస్తాడు, లేదా అక్కడ ఉండటం వల్ల అత్తరు తాలూకు సువాసనయినా అతనికి సోకుతుంది. చెడు స్నేహితుని ఉపమానం కొలిమిని ఊదే వాని వంటిది. అక్కడి కెళితే కొలిమి తాలూకు నిప్పు రవ్వలయినా అతనిపై పడొచ్చు, లేదా దాని తాలూకు పొగ బాధనయినా అతను భరించాల్సి ఉంటుంది”. (అబూ దావూద్)
స్నేహితులు మూడు రకాలు. 1) ఆహారం వంటి వారు. వీరి అవసరం మనకు ఎప్పుడూ ఉంటుంది. 2) ఔషధం వంటి వారు, వీరి అవసరం అప్పుడప్పుడూ ఉంటుంది. 3) రోగం వంటి వారు. వీరి అవసరమే మనకుండకూడదు.
ఈ విషయమయి మనం నిశితంగా అలోచించినట్లయితే అనాదిగా స్నేహానికి నిర్వచనాలిచ్చే ప్రయత్నం చాలా మందే చేశారు. వారిలో అరిస్టాటిల్ కూడా ఒకడు. ఆయన స్నేహాన్ని మూడు వర్గాలుగా వర్గీకరించారు. 1) అవసరం కోసం స్నేహం చేెసే పచ్చి స్వార్థపరులు. 2) సరదా కోసం స్నేహం చేసే సరదారాయుళ్ళు. (ఈ రెండు విధాల స్నేహాల్లో ఒకటి కాగే పెనుము మీద పడే చినుకు వంటిదయితే, మరొ కటి తామరాకుపై పడే చినుకు వంటిది. అదేమో ఆవిరయిపోతుంది. ఇదేమో తళుక్కున మెరిసి మాయమయిపోతుంది.) ఈ రెంటిలో నిస్వార్థత లేదు. వీటికంటూ ఒక ఖచ్చితమయిన పునాది ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు స్నేహాలు పేక మేడ లాంటివి. ఎంత సేపు నిలబడతాయో, ఏ క్షణం కుప్ప కూలుతాయో తెలీదు. ఇక మూడవ కోవకు చెందిన స్నేహం వీటికి పూర్తి భిన్నమయినది..
అదే నిజమయిన స్నేహం. దీన్నే మనం పరమోన్నత మిత్రుడయిన అల్లాహ్‌ా మాటల్లో చెప్పాలంటే – ”ఈ రోజు ప్రాణ మిత్రులు కూడా ఒకరినొకరు బద్ధ శత్రువులయిపోతారు. అయితే దైవ భీతిపరులు, తఖ్యాపరులు, ధర్మపరాయణులు తప్ప”. (43:67)
దీనికి భిన్నంగా చెడ్డ స్నేహితుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ రోజు దుర్మార్గుడయిన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా వాపో తాడు: ‘అయ్యో! నేను దైవప్రవక్త (స) వారి మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుండేది. అయ్యో! నా పాడుగాను. నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బావుండేది. నా వద్ద కు సత్యోపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాన్ మనిషికి ద్రోహం చేసే (నట్టేటా ముంచే) వాడే’ అని. (25: 27-29)
పై వాక్యాలను బట్టి బోధ పడేదేమిటంటే, దైవ ద్రోహులతో, పాపా త్ములతో, పాషాణ హృదయులతో ఎన్నడూ స్నేహం చేయకూడదు. అర్థరహితంగా, లక్ష్య రహితంగా, గమ్య రహితంగా జీవించే వారితో స్నేహం చేెయడం మన ఇహపరాలను పణంగా పెట్టి మన వినాశ నాన్ని మనమే కొని తెచ్చుకోవడమే, కోరి మరి తలకొరివి పెట్టుకోవ డమే అవుతుంది.
దీనికి భిన్నంగా నిర్మాణాత్మక స్నేహాన్ని, స్నేహితుల్ని మనం ఎంచుకో వాలి. అది మనల్ని ఉన్నత ఆశయాల పూర్తికై, ఉత్తమ గుణాల పరిపక్వతకై, అత్యుమ నైతిక ప్రమాణాల పరిపూర్తికై తోడ్పడాలి. మంచిని పెంచాలి, చెడును తుంచాలి. న్యాయం కోసం పోరాడాలి. ధర్మం కోసం ధ్వజమెత్తాలి. హక్కుల పరిరక్షణకై పరిశ్రమించాలి, పీడిత ప్రజలకు అండగా నిలవాలి. అనాథలను అనుఁగు సంతానంగా భావించాలి. నిరాశ్రయులకు ఆశ్రయమివ్వాలి. అభాగ్యులను అక్కున చేర్చుకోవాలి. గాడి తప్పిన బ్రతుకుల్ని గాడిలోకి తేవాలి. మార్గం తప్ని మనుషుల్ని మాధవుని బాటన నడిపించాలి. ప్రేమించాలి, క్షమించాలి, అందరితో అత్యుత్తమంగా వ్యహరించాలి. అది విధరాలి కన్నిటిని తుడవాలి. బాధాతప్త హృదయుణ్ణి ఓదార్చాలి. సమాజ శ్రేయం కోసం, దేశ సంక్షేమం కోసం, లోకశాంతి కోసం అలుపెరగని కృషి చేసేలా మనల్ని తీర్చిదిద్దాలి.అలా మనం చేసి నాడు విశ్వకారుణ్య ప్రభువయిన అల్లాహ్ మన విషయంలో చేసిన వాగ్దానం అక్షర సత్యమయి నిలు స్తుంది. ”విశ్వసించిన ఇలాంటి స్త్రీ-పురుషులకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. శాశ్వత స్వర్గ వనాలలో అందమైన భవనాలు వారి కొరకు ఉంటాయి. వీటన్నింటికి మించి గొప్పదయిన అల్లాహ్‌ా ప్రసన్నత వారికి లభిస్తుంది. గొప్ప సాఫల్యం, మహా విజ యం అంటే ఇదే”. (9: 71,72)
ఓ సహాబి మదీనా వచ్చి రాగానే అల్లాహ్ సమక్షంలో మోకరిల్లి చేసిన దుఆ”ఓ శుభకరా! అపరిచిత ప్రాంతంలో నాకో మంచి సావాసిని అనుగ్రహించు” అని. ఫలితంగా అల్లాహ్ అబూ హురైరా (ర) వంటి మిత్రుణ్ణి ఆయను ప్రసాదించాడు. కాబట్టి మనమూ ఆ అనుగ్రశీలిని వేడుకుందాం రండీ! ”అల్లాహ్‌ా ఓ దయాకరా! మా తప్పిదాలు బ్రోవరా, మా జీవితాలు మలచరా! కేవలం నీ ప్రసన్నత కోసం పరస్ప రం ప్రేమించుకునేవారి జాబితాలో చేర్చి మహోన్నత నీ అర్ష్ నీడలో చోటుననుగ్రహించు స్వామీ!