వ్యాధులన్నీ అంటు వ్యాధులై ఉంటాయా?

10171137_437241819754188_1226067349_n

– అల్లామా ఇబ్ను బాజ్ (ర)

 

ప్రశ్న:- అంటు వ్యాధుల గురించి ఇస్లామీయ షరీయత్‌ ఏమంటోంది?

జవాబు:- వ్యాధుల్లో రెండు రకాలున్నాయి. ఒకటి:- వ్యాధిగ్రస్త్తుణ్ణి మాత్రమే బాధించేవి. రెండు:- వ్యాధిగ్రస్తునితోపాటు చుట్టప్రక్కల ఉన్నవారికి సైతం సొకేవి. ఇలాంటి అంటు వ్యాధుల్లో కూడా కొన్ని తేలికపాటివి, మరికొన్ని తీవ్రమైనవి ఉంటాయి. తేలికపాటి అంటువ్యాధుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. భయంకరమైన అంటువ్యాధలకు ఆమడ దూరాన ఉండటమే మంచిది. ఒకసారి దైవప్రవక్త (స) కుష్టు వ్యాధి సోకిన వ్యక్తితో కలిసి భోజనం చేశారు. అదేమంటే ”అల్లాహ్‌పై నమ్మకంకొద్దీ అలా చేశాన”న్నారు. (ఫత్‌హుల్‌ బారీ). మరికొన్ని ఉల్లేఖనాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ”కుష్టు రోగి నుండి పులి మాదిరిగా పారిపోండి” (బుఖారీ)అని ఒక ఉల్లేఖనం ఉంది. ”రోగిష్టులైన ఒంటెలను ఆరోగ్యవంతమైన ఒంటెల మందలోకి తోలకండి” (బుఖారీ, ముస్లిం) అనే హదీసు కూడా ఈ సందర్భంగా గమనార్హమే.

హజ్రత్‌ సాద్‌, హజ్రత్‌ అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ఔఫ్‌ (ర)ల కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్‌ (స) ఒకసారి ఇలా అన్నారు: ”ఏదైనా ఒక ప్రదేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినట్లు తెలిస్తే అక్కడకు వెళ్ళకండి. ఒకవేళ మీ స్థిర నివాసంలోనే గనక ఈ వ్యాధి ప్రబలినట్లయితే మీరు సైతం బయటికి వెళ్ళకండి”. (బుఖారీ)

ఈ రెండురకాల ఉల్లేఖనాలను సమన్వయపరుస్తూ హాఫిజ్‌ ఇబ్నె హజర్‌ (ర) పండితుల ప్రవచనాలను క్రోడీకరించారు. పూర్వం అజ్ఞానకాలంలో జనులు వ్యాధుల గురించి ఎన్నో భయాందోళనలకు గురయ్యేవారు. వ్యాధులు స్వతహాగా అంటు స్వభావం కలవని, చాలా సులభంగా అవి ప్రజల్లో వ్యాపిస్తాయని ఇందులో దైవ శక్తికి, దైవ ప్రమేయానికి తావు లేదని నమ్మేవారు. ఇది సరైనది కాదు. ఏ ఉల్లేఖనాల ద్వారా అయితే ‘అంటు’ సోకుతుందని నిర్ధారణ అయిందో అవి సయితం దైవ ప్రణాళికకు లోబడి ఉన్నాయి. హాఫిజ్‌ ఇబ్నె హజర్‌ (ర) గారి వివరణను బట్టి అత్యధిక మంది విద్వాంసుల అభిమతం ఇదేనని రూఢీ అవుతోంది. (ఫత్‌హుల్‌ బారీ)

అయితే నేటి వైజ్ఞానిక యుగంలోనూ అంటు వ్యాధులు కేవలం ఊహలకే పరిమితం కాలేదు. అనుదినం అవి తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. దైవం మరియు దైవప్రవక్త (స) పలుకులు ఎన్నటికీ సత్య విరుద్ధం కాజాలవు. వాటిలో కొన్ని వ్యాధులు వైరస్‌ వల్ల వ్యాపిస్తుంటే మరికొన్ని తెలియని ఎన్నో కారణాల వల్ల విజృంభి స్తున్నాయి. స్వైన్‌ ప్లూ, చికెన్‌ గున్యా, డేంగూ వ్యాధులు ఈ మధ్యకాలంలో జన సముదాయాలను ఎలా గడ గడలాడించాయో విదితమే.

 

ప్రశ్న: చాడీలు చెప్పటం, పరోక్ష నిందకు పాల్పడటాన్ని దివ్య ఖుర్‌ఆన్‌ ఖండించడమేగాక, దానిని చనిపోయిన తమ మృత సోదరుని మాంసం తినటంగా అభివర్ణించింది. అయితే ఏదైనా షరీయతు పరమార్థంతో పరోక్ష నింద చేయటానికి అనుమతి ఉందా?

 

జవాబు: చాడీలు చెప్పడం, వీపు వెనుక నిందించటం, సాటి ముస్లిం సోదరులలోని తప్పులను ఎంచటం ముమ్మాటికీ తీవ్రమైన విషయం, ఘోర అపచారమే. కానీ ఈ ఆదేశాలన్నీ ఇస్లామీయ వ్యవస్థ యొక్క ఉద్దేశాలకు, పరిణామాలకు లోబడి ఉంటాయి. ఏదైనా ఒక షరీయతుపరమైన ముఖ్య విషయానికి సంబంధించి ఒకరి పరోక్షంలో నిందించవలసిన, రహస్యాన్ని బహిర్గతం చేయాల్సిన అగత్యం ఏర్పడితే తప్పు లేదు. పైగా ఒక్కోసారి గుట్టు రట్టు చేయటం అవశ్యమవుతుంది.

అందుకే చాడీలను నిరసించే హదీసులను క్రోడీకరించిన హదీసువేత్తలు, వాటిని వెల్లడించాల్సిన సమయం సందర్భాలను కూడా సూచించారు. ఉదాహరణకు:- ఇమామ్‌ బుఖారీ (రహ్మ) పెట్టిన ఒక మకుటంలో ”కలహాకారుల, కుత్సితుల గురించి మోపే నింద సమ్మతమే”. (బుఖారీ – 2/891)
ఈ హదీసుకు ఆధారంగా ఒక సంఘటన- ఒక వ్యక్తి దైవప్రవక్త (స)ను కలుసుకునేందుకు అనుమతి కోరగా ఆయన (స) అందుకు అనుమతించారు. ఇది ప్రవక్త (స)లోని మంచితానికి నిదర్శనం. మరో వైపు ఆయన (స) ఆ వ్యక్తి గురించి తన ధర్మపత్ని ఆయిషా (ర)కు చెబుతూ, ‘అతను తన వంశస్థులందరిలోకెల్లా చెడ్డవాడు’ అనన్నారు. (బుఖారీ)

అలాగే తన వద్దకు వివాహ సందేశం పంపిన ఇరువురు వ్యక్తుల నడవడిక గురించి హజ్రత్‌ ఫాతిమా బిన్తె ఖైస్‌ విచారించగా, ఆ ఇరువురు వ్యక్తులు కూడా ఆమెకు తగినవారు కారని దైవప్రవక్త (స) అబిప్రాయపడ్డారు. ఆ ఇద్దరిలోనున్న లోపాలను ఆయన (స) ఆమెకు వివరించారు.

గత్యంతరం లేని పరిస్థితిలో చాడీలు చెప్పడాన్ని ఇస్లామీయ విద్వాంసులు ధర్మ సమ్మతమన్నారు. ఉదాహరణకు:- అన్యాయాన్ని అడ్డుకోవడం, చెడుల నిర్మూలన, సంస్కరణ, ధార్మిక తీర్పులను కోరినప్పుడు, న్యాయస్థానంలో కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు మొదలగునవి. ఒక వ్యవస్థలోని ప్రముఖులకు వారి తాబేదారుల నిజస్థితిని గురించి చెప్పటం, వివాహ సంబంధాల విషయంలో వధూవరుల గురించి ఉన్నదున్నట్టుల పరోక్షంలో వివరించటం, పాప కార్యాలకు, దురాచారాలకు పాల్పడేవారి గురించి నాయకులకు ఫిర్యాదు చేయటం కూడా ధర్మసమ్మతమే. (ఫత్‌హుల్‌ బారీ)

Related Post