హలాల్‌ సంపాదన వికసిస్తుందిహరామ్‌ సంపాదన కుంచించుకుపోతుంది

Originally posted 2013-06-03 07:22:06.

rupee2--621x414
 ముహమ్మద్ సలీం జామయి
ధర్మ సమ్మతమైన జీవనోపాధి సౌభాగ్యానికి, సమృద్ధికు పునాది
ధనం మనిషికి ఒక అవసరం. దాని కోసం ప్రతి మానవుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ధనం సంపాదించటానికి ప్రపంచంలో ఎన్నో మార్గాలున్నాయి. అందులో కొన్ని అధర్మమైనవీ, కొన్ని సక్రమ మైనవైతే, కొన్ని అక్రమమైనవని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి మనిషి ధన సంపాదన కొరకై అవలంబిస్తున్న మార్గం ధర్మ సమ్మతమైనదా లేక అధర్మమైనదా? అని ఆలోచించాలి. ఎందుకంటే మనందరినీ సృష్టించిన దేవుడు అక్రమ మార్గాల్లో ధనం సంపాదించ టాన్ని నిషేధించాడు. ధర్మసమ్మతమైన మార్గాన్నే అవలంబించాలని ఆదేశించాడు.
  ప్రతి మనిషీ విశ్వసించాల్సిన ఒక విషయం దైవ గ్రంథంలో ఉంది. అదేమంటే మావ సమాజానికి హాని కలిగించే పద్ధతులనే దేవుడు నిషేధించాడు, మంచి మార్గాలన్నింటినీ ధర్మసమ్మతం చేశాడు. దైవం నిషేధించిన మార్గంలో మనిషికి శ్రేయం, శుభం రెండూ లేవు, దైవం ధర్మసమ్మతం చేసిన మార్గంలో మనిషికి శ్రేయం, శుభం రెండూ కలుగుతాయి. కానీ మానవులు ధనవంతులైపోవాలనే ఆశలో పడి మంచి – చెడు, ధర్మం – అధర్మమన్న మాటే మరచిపోయారు. నిర్భయంగా అక్రమ మార్గాల్లో అమాయకులను దోచుకుని, విచ్చలవిడిగా అధర్మ సంపాదనను ఆరగిస్తున్నారు. వాస్తవానికి దైవం మరియు దైవ ప్రవక్త (స) అక్రమ మార్గాలను నిషేధించి, అధర్మానికి పాల్పడినవారికి కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు.
ఉదాహరణకు ఈ విధంగా ఆదేశించబడింది: ”మీలో మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన పద్ధతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగాన్ని కాజేసే టందుకు అధికారులకు ముడుపులు చెల్లించకండి”. (బఖరా: 188)
 మహనీయ ముహమ్మద్‌ (స) ఇలా తెలియజేశారు: ”మీలోని ప్రతి ఒక్కరి – రక్తం (ప్రాణం), ధనం మరియు మానం (కాజేయటం) మరొకరిపై నిషేధించబడింది”.
  ఓ సందర్భాన ప్రవక్త మహనీయులు (స) ఇలా తెలియజేశారు: ”శరీరంలోని ఏ భాగమైతే అక్రమ సంపాదనతో పెరుగుతుందో అది నరకాగ్నికి అతి చేరువవుతుంది”.
 మరో సందర్భంలో ఇలా హెచ్చరించారు: ”మానవుల్లో కొంత మంది వేరొకరి సంపాదనలో అక్రమంగా జోక్యం చేసుకుంటారు. అలాంటివారు రేపు పరలోకంలో నరకానికి ఆహుతి అవుతారు”.
 మానవులు దేని కారణంగా ఎక్కువ నరకానికి చేరుతారని ప్రవక్త (స)ను ప్రశ్నించగా – ”మర్మాంగం మరియు నోరు (ఈ రెండింటి) కారణంగా మానవులు అధికంగా నరకానికి చేరుతార”ని ప్రపవక్త (స) చెప్పారు.
  ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, నోటి ద్వారా దుర్భాష లాడటం, నిందలు మోపటం, అపద్ధపు సాక్ష్యాలు పలకటం లాంటివి మానవుణ్ణి నరకానికి చేర్చే ఒక కారణమైతే, ఆ నోటి ద్వారా అధర్మ సంపాదనను ఆరగించటం మరో కారణమౌతుంది.
నష్టాలు
అక్రమ సంపాదన వల్ల ప్రజల్లో మానవత్వం నశించిపోవటమే కాకుండా కొన్ని ఇతరత్రా నష్టాలు కూడా జరుగుతాయి.    దేవునితో తన సమస్యలను పరిష్కరించుకోవటానికి మానవుని కోసం దైవం తరఫున ప్రతిపాదించబడిన మార్గం ప్రార్థన. అక్రమంగా సంపాదించిన ఆహారం కేవలం ఒక్క మెతుకు భుజిస్తే అతని 40 రోజలు పార్థన స్వీకరించబడదని ప్రవక్త (స) హెచ్చరించారు. మరి జీవితం మొత్తం అక్రమ సంపాదనతోనే గడిపేస్తున్నవారి పరిస్థితి ఏమౌతుందో ఆలోచించవలసి ఉంది.
  ఒకసారి దైవప్రవక్త (స) తమ అనుచరులకు ఒక ఉదాహరణ ద్వారా ఇలా తెలియజేశారు: ”ఒక బాటసారి చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తాడు. (ప్రయాణం వలన) అతని ముఖం దుమ్ము కొట్టుకుని, జుత్తంతా చిందరవందరగా ఉంటుంది. అతను రెండు చేతులెత్తి ‘ఓ దేవా! ఓ నా దేవా!, అని కడు దీనంగా ప్రార్థిస్తాడు. కాని అతను తినే తిండి హరామ్‌ తిండి, అతను త్రాగేది కూడా హరామే. అతను ధరించిన దుస్తులు కూడా హరామ్‌ దుస్తులే. అతని శరీరం అధర్మ సంపాదనతో పోషించబడింది. అలాంటప్పుడు అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది?”
  అక్రమంగా సంపాదించినవాడు, దాన్ని ఆరగించినవాడు నరక శిక్షలు అనుభవిస్తాడని దైవ ప్రవక్త (స) చాలా సందర్భాలలో హెచ్చరించారు. అక్రమ సంపాదనలో దైవం తరఫున శుభం కలుగదు. అతను ఎంత తిన్నా కడుపు నిండదు. అతనికి మనశ్శాంతి కలుగదు. అందుకే మన పూర్వీకులు, ప్రవక్తలు, సహాబాలు, ఇమాములు, విద్వాంసులు అక్రమ సంపాదనకు దూరంగా ఉండేవారు.
  ముస్లింల ప్రథమ ఖలీఫా అబూ బకర్‌ (ర) ముందు, ఆయన బానిస తినటానికి ఒక పదార్థం సమర్పించాడు. అబూ బకర్‌ (ర) దాని గురించి విచారించకుండానే ఆరగించారు. కాని తను భుజించిన పదార్థం అక్రమంగా ఆర్జించబడిందని తరువాత ఆయనకు తెలిసింది. వెంటనే నోటిలో వ్రేళ్ళు వేసి అతి కష్టం మీద తిన్నదంతా కక్కేశారు. ఈ వైనాన్ని చూసిన ఒకరు, ‘చిన్న పదార్థం తిన్నంత మాత్రానికే ఇంతగా ఆందోళన ఎందుక’ని ప్రశ్నించగా, ”మానవుని శరీరంలోని ఏ భాగం అక్రమ సంపాదనతో ఎదుగుతుందో అది నరకాగ్నికి ఆహుతి అవుతుందని ప్రవక్త (స) వారు చెబుతుండగా నేను విన్నాను. ఈ పదార్థం వల్ల నా శరీరంలో ఒక్క చుక్క రక్తమయినా తయారయిందంటే నేను నరకానికి వెళ్ళాల్సి వస్తుందని భయపడి ఇలా చేశాన” ని జవాబిచ్చారు.
  ఇమామ్‌ అబూ హనీఫా (రహ్మ) బట్టల వ్యాపారం చేసేవారని చరిత్ర కారులు చెబుతారు. ఒకసారి థానులోని లోపాన్ని చూపించిన మీదటే అమ్మమని తన గుమాస్తాకి ఆదేశించి బయటికి వెళ్ళారు. కొద్దిసేపటికి ఒక కస్టమర్‌ వచ్చాడు. అతనితో మాటల్లో పడి థానులోని లోపాన్ని చూపాలన్న విషయం మరచిపోయాడా గుమాస్తా. పది వేల దిర్హముల బట్టలు కొని కస్టమర్‌ వెళ్ళిపోయాడు. తరువాత అబూ హనీఫా (రహ్మ) తిరిగివచ్చినప్పుడు ఆ గుమాస్తా తాను పది వేల దిర్హముల బట్టలు అమ్మినానని లెక్కలు చెబుతూ… థానులోని లోపం చూపలేక పోయానని చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే ఇమామ్‌ అబూ హనీఫా (రహ్మ) ఆ పది వేల దిర్హములు అధర్మమైనవనీ, అవి తన సంపాదనలో కలిసిపోకూడదని భావించి బీదవారికి దానం చేసేశారు.
  మన పూర్వీకులు, మహనీయులు అక్రమ సంపాదనకి ఎలా దూరంగా ఉండేవారో గమనించటానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. మరి నేడు మన పరిస్థితిని చూడండి! నేడు మనం వర్తకంలో ఈ నిజాయితీని పాటించటం లేదు. హలాల్‌-హరామ్‌, ధర్మం-అధర్మం అనే తేడా చూడకుండా సంపాదిస్తూ పోతున్నాం. ఈ దిగజారుడుకు కొన్ని కారణాలు ఇవి కావచ్చు….
1) ప్రతి మనిషి తొందరగా ధనవంతుడైపోవాలని ఆశపడుతున్నాడు. సంపదలో తన సహచరులను మించిపోవాలని ఆరాటపడుతున్నాడు. ఇలాంటి ఆలోచనతోనే అతను వడ్డీ వ్యాపారం, మత్తు పదార్థాలను అమ్మటం, లంచం తీసుకోవటం, అశ్లీలమైన లిట్రేచర్‌ని అమ్మటం, దొంగతనం చేయటం, మట్కా ఆడటం… ఇంకా దిగజారిపోయి అనేక నీచమైన పనులు చేయటం, మానవత్వాన్నే మరచిపోయి మృగంలా వ్యవహరించటం లాంటి చాలా పనులు చేస్తున్నాడు. వీటన్నింటినీ ఇస్లాం ధర్మం నిషేధించింది.
  ఇలా చేసేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి అక్రమ మార్గాలు! నిషేధించబడ్డ మార్గాలు! నలుగురికీ ద్రోహం కలిగించే మార్గాలు! ఇలా దొడ్డి దోవలో వచ్చిన సంపాదనలో శుభముండదు. రేపు పరలోకంలో దేవుని ముందు చేసిన కర్మలకు లెక్క చెప్పటానికి నిలబడినప్పుడు అతను ప్రపంచంలో ధనం ఎలా సంపాదించాడు, ఎక్కడ ఖర్చు చేశాడన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అడుగు కదిలించటానికి వీలు కాదని ప్రవక్త (స) స్పష్టంగా తెలియజేశారు. ఆ రోజు ఈ అక్రమ మార్గాలతో సంపాదన కొనసాగించేవారు దేవునికి ఏమి సమాధానం చెప్పగలమన్నది ఆలోచించాల్సిన అవసరముంది.
2) అక్రమ మార్గాలతో తప్ప ధర్మసమ్మతమైన మార్గాలతో ధనవంతులం కాలేమని మరి కొందరు భ్రమ పడతారు. ఈ ఆలోచన విశ్వాసానికి, దైవ వాగ్దానాలకి విరుద్ధం. సమస్త జీవరాసులకు సౌభాగ్యాలు ప్రసాదించే ప్రభువు ధర్మసమ్మతమైన సంపాదనలో వృద్ధి కలిగిస్తానని, అక్రమ సంపాదనను  క్ష్షీణింపజేస్తానని చెప్పాడు. దైవభీతితో వ్యవహరించేవారికి (అక్రమ సంపాదనలకు దూరంగా ఉండేవారికి) వారు ఊహించని చోటు నుండి సంపాదనను కలుగజేస్తానని కూడా వాగ్దానం చేశాడు.
  నేడు అక్రమ మార్గాలకు పాల్పడి రోడ్డున పడ్డవారి  ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక మార్గం నుండి సంపాదిస్తే పది మార్గాల ద్వారా అది నాశనమైపోవటం కూడా మనం (ప్రపంచంలో) చూస్తున్న విషయమే.
  కాబట్టి మనం అక్రమ సంపాదనను ఆశించకుండా ధర్మసమ్మతమైన మార్గాన్నే అవలంబిస్తూ అందులోనే వృద్ధిని ప్రసాదించమని దైవాన్ని వేడుకోవాలి.

Related Post