అబ్దుల్ ఖాదిర్ ఉమ్రీ
భారతీయులు సంభాషణా చతురులు. వాక్భూషణులు. చిన్న పరిచయం చాలు ఇట్టే అల్లుకు పోతారు. పరిచయం లేకపోయినా సరే…దరహాస తోరణాలతో, అభివాద పూ బాణాలతో ఇట్టే ఆకట్టుకుంటారు. వారి ఈ విశేష గుణం కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా వారంటే అభిమానం, నమ్మకం. ప్రజలు మన పట్ల కలిగి ఉన్న ఆ నమ్మకాన్ని, ప్రత్యేకతను కాపాడు కోవాల్సిన బాధ్యత భారత సత్పౌరులుగా మనందరిపై ఉంది.
మనమందరం భారతీయులం. మనమందరం ఒకే దేవుని దాసులం. తెల్లవారయినా, నల్లవారయినా, ధనికులయినా, పేదవారయినా, ముస్లింలయినా, హిందువులయినా, సిఖ్ఖులయినా, క్రైస్తవులయినా, ఆస్తికులయినా, నాస్తికులయినా, ఆంగ్లేయులయినా, అరబ్బులయి నా అందరం మానవ జాతికి చెందిన వారమే. జగమంతా మన కుటుంబమే. మనమూ ఆ కుటుంబంలో అంతర్భాగమే. మనలో శత్రువుని సయితం కనికరించే ప్రేమతత్వం చిగు రించాలి. సంకుచితత్వం, స్వార్థబుద్ధి అంతరించాలి. అంటరానితనం, అస్పృశ్యత, ఓర్వలేని తనం, జాత్యాహంకారం, వర్గ దురభిమానం, కుల పిచ్చి, వేర్పాటు వాదం వంటి వినాశ కాలు దూరమవ్వాలి. మనలో ప్రతి ఒక్కరు శాంతిసుస్థిరతల వాతావరణం కోసం మన వంతు కృషి చేయాలి. శాంతి విఘాతక శక్తుల్ని, మానవతా ద్రోహుల్ని నిలువరించాలి, నియంత్రించాలి.
నేటి ఈ గణతంత్ర దిన శుభ సందర్భంగా – ‘మజ్‌హబ్ నహీ సిఖాతా ఆపస్ మేఁ బైర్ రఖ్నా’ – ఏ మతమయినా బోధించదుగా ద్వేషాన్ని-రూపు దిద్దుదాం భిన్నత్వంలో ఏక త్వాన్ని’ అన్న మాటకు అక్షర రూపాలయి భాసిల్లాలి మనం. మనసా, వాచా, కర్మణా దేశ అభ్యున్నతిని, దేశ సుస్థిరతను, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాలి మనం. దేశం మనకేమి చ్చిందన్న ఆత్మ నిందను మాని, మనం దేశానికి ఏమివ్వగలమన్న ఆత్మావలోకనం మనలోని ప్రతి ఒక్కరిలో చోటు చేసుకోవాలి. మనం ఎదగాలి, మన దేశాన్ని ప్రగతి పథాన నడిపిం చాలి. దేశ పౌరుల సమస్యల పరిష్కార్థం నిస్వార్థంగా ముందుకు వచ్చే ఉత్తమ లక్షణాలు గల వారినే మనం మన నాయకులుగా ఎన్నుకోవాలి. ప్రజల ప్రతి ”నిధి”ని దోచుకుని బ్యాంకుల్లో దాచుకునే ప్రతి వంచకుణ్ణి ప్రతిఘటించాలి. దేశ రక్షణ కోసం, శాంతి విఘాతక శక్తుల నిర్మూలన కోసం పూర్తి చిత్తశుద్ధితో, అంకిత భావంతో మనమం దరం సంఘటితంగా కృషి చేయాలి. వరకట్న దురాచారాన్ని, లంచగొండితనాన్ని పారద్రో లేందుకు ప్రతీన బూనాలి మనం. ధర్శ సంస్థాపనార్థాయః అవిరళంగా పరిశమ్రించేందుకు కంకణం కట్టాలి మనం.
పిల్లల్ని ప్రేమించాలి మనం. పెద్దలను గౌరవించాలి. స్త్రీలను గౌరవించాలి. గురువులను అభిమానించాలి. మనలో దాతృత్వం, సేవా దృక్పథం మొగ్గలు తొడగాలి. నిరుపేదలను ఆదుకోవాలి. అనాథలకు ఆశ్రయం కల్పించాలి. వితంతువులకు, వికలాంగులకు సహాయ పడాలి. మన ప్రేమను మానవుల వరకే పరిమితం చేయక జీవ కోటి వరకు విస్తరింప జేయాలి. తల్లిదండ్రుల ఎడల, బంధుమిత్రుల పట్ల మంచిగా మెలగాలి మనం.
ఈ శుభ సందర్బంగా ప్రవాసాంధ్రులతో మాదో విన్నపం-తేనెలొలికే తెలుగుని కాపాడు కోవాల్సిన బాధ్యత తెలుగువారిగా మనందరిపై ఉంది. భాషకు మనసును గెలుచుకునే మహత్తర శక్తి ఎలాగయియితే ఉంటుందో, మనసుల్ని, మనుషుల్ని దూరం చేసే, విడదీసే శక్త్తి కూడా అంతే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే – మన బలహీనతా సంభాషణే, మన బలమూ సంభాషణే. మాటలు మాత్రమే కలిస్తే అదో మొక్కుబడి సంభాషణ అవు తుంది. హృదయాలు కూడా కలిసినప్పుడే దానికి అందమూ, అర్థమూ, పరమార్థమూ ఉం టుంది. సభా మర్యాదలు ఎంత అవసరమో సంభాషణా మర్యాదలూ అంతే అవసరం.
పోతే, తెలుగు పలుకుల్లో గల మాధుర్యం అనిర్వచనీయం! అవి కొత్తావకాయలా నోరూరు స్తాయి. నేతి అరిసెల్లా ఘుమఘుమలాడుతాయి. రాగి సంగటిలా కమ్మగా ఉంటాయి. సకి నాల్లా కరకరలాడుతుంటాయి. పూర్ణాల్లా నర్మగర్భంగా అనిపిస్తాయి. చల్ల మిరపకాయల్లా భలే చురకలూ పుట్టిస్తాయి. పూత రేకుల్లాంటి తెలుగు పలుకుల సౌరభాలను విశ్వ వ్యాప్తం చేసేందుకు ప్రయత్నిద్దాం రండీ!