సమాజానికి పట్టిన చీడ వడ్డీ పీడ

1325756543591

మౌలానా అన్వర్ సలఫీ

వడ్డీ మానత్వానికి వ్యతిరేకంగా ఓ సామాజిక మహాపరాధం. ఇది దురదుష్టవశాత్తు మానవ సమాజాలన్నింటిలోనూ క్యాన్సర్‌లా వ్యాప్తి    చెందింది. ఏ ఒక్క మానవుడు, ఏ ఒక్క వ్యాపా రం, ఏ ఒక్క బ్యాంకు కూడా దీని ప్రభావం నుండి బహుశా సురక్షితంగా లేదేమో! ఈ పాపం ఎంతగా వ్యాప్తి చెందిందంటే దాన్ని నిషే ధంగా, పాపంగా భావించే వారిని లోకం నేరస్తులుగా చూస్తున్నది. నిజానికి ఇది ప్రళ యం సమీపించిందనటానికి ఓ ఆనవాలు. అలాగే జాతులు, రాజ్యాల వినాశానికి కూడా ఇది ఒక సంకేతం. వినాశకరమైన ఈ పాపం గురించి పాఠకులకు కొన్ని ఇస్లామీయ ఆదేశాలు తెలియపరుస్తున్నాం. బహుశా దీని ద్వారా వడ్డీ శాపానికి గురై ఉన్న సోదరులకు పశ్చాత్తా పం(తౌబా)చెందే సద్బుద్ధి లభిస్తుందని ఆశిస్తు న్నాము.

 వడ్డీ నిర్వచనం

వడ్డీని అరబీలో ”రిబా” అంటారు. నిఘంటువు ప్రకారం దీనికి వృద్ధి, అధికం, అదనం అనే అర్థాలొస్తాయి. షరీఅత్‌ పరిభాషలో ”రిబా” నిర్వచనం పలు విధాలుగా చేయడం జరిగింది. ఇమామ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ జుర్‌జానీ గారు రిబా గురించి ఇలా వివరించారు: ”ఏదైనా ఒక వస్తువుకు బదులు ఒక వర్గం మరో వర్గంపై షరతుగా విధించే ప్రతి ఒక్క అధిక సొమ్ముని రిబా అని అంటారు.      (అత్తారీఫాత్‌ లిల్‌ జుర్‌జానీ :114)

ఒక వర్గానికి అసలు ధనంపైన లాభాన్నిచ్చే ప్రతి రుణాన్ని రిబా అంటారు.  (కషాఫ్‌ ఇస్తిలా హాతుల్‌ ఫునూన్‌)   భారత ఉపఖండంలో పేరు పొందిన పండితులు మౌలానా అబ్దుల్‌ మన్నాన్‌ నూర్‌పూరీ వడ్డీ గురించి  వివరిస్తూ  ఇలా అన్నారు: ప్రజా బాహుళ్యంలో వడ్డీగా ప్రసిద్ధి చెందిన ప్రతి సొమ్మూ వడ్డీ అవుతుంది .అది వ్యక్తిగతమైనదైనా, సమాజపరమైనదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా, బ్యాంకులకు సంబంధించినదైనా, ఇన్సూరెన్స్‌కు సంబంధిం చినదైనా, కంపెనీలకు సంబందించినదైనా, ముస్లిం రాజ్యంలోనయినా, ముస్లిం దేశం కాక పోయినా, ముస్లింల తరపునైనా, ముస్లిమేతరుల తరపునైనా జిమ్మీల, తరపునైనా, హర్‌బీల తరపు నైనా, ఆకాశం క్రింద భూమి పైన   ఏ భాగంలో నయినా జనబాహుళ్యంలో వడ్డీగా పరగణించ బడే ప్రతి వస్తువుని వడ్డీ అంటారు.  (ఇస్తిఫాదహ్‌ అజ్‌ మఖాలాత్‌ నూర్‌పూరీ:64)

 వడ్డీ నిషేధాజ్ఞ

ఇస్లాంకు పూర్వం అరబ్బులలో వడ్డీ రివాజు సర్వసామాన్యంగా ఉండేది. వ్యాపారంలోనూ, ఇతర ఇచ్చిపుచ్చుకునే వ్యవహారలలోనూ వడ్డీ చాలా రకాలుగా వ్యాపించిపోయి ఉండేది. అప్పటికి మక్కాలో ఇస్లామీయ వ్యవస్థ పూర్తిగా స్థాపించబడలేదు.అందుచేత ఇస్లాం యొక్క ఎక్కువ ఆజ్ఞలు మదీనాలో అవతరించాయి. మదీనాలో ఇస్లామీయ సమాజం సలక్షణంగా స్థాపించ  బడి ఉండింది. అందువల్ల దైవప్రవక్త (స) యొక్క మదనీ జీవితపు మొదటి రోజులలోనే అల్లాహ్‌ వడ్డీని నిషేధించాడు.  అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:  ”ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్‌కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలి వున్న వడ్డీని విడిచి పెట్టండి. ఒక వేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు. ఒకవేళ రుణ గ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయో దాయకం”.        (అల్‌ బఖర:278-280)

”ఓ విశ్వసించిన వారలారా! ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి.మీరు సాఫల్యం  పొందటానికి గాను అల్లాహ్‌కు భయపడండి. అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి. అల్లాహ్‌కూ, ప్రవక్తకూ విధేయత చూపండి-తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది.  (ఆలి ఇమ్రాన్‌:130-132)

హజ్జతుల్‌ వదా సందర్భంగా అరేబియా నలు మూలల నుంచి సహాబాలు తరలి వచ్చారు. అటువంటి సమయంలో దైవప్రవక్త(స) మారుపరమైనా మరియు వ్యాపారపరమైన వడ్డీ నిషేధాన్ని ప్రకటించారు: ఆయన (స) ఇలా అన్నారు: ”వినండి! అజ్ఞాన కాలం నాటి ప్రతి వస్తువు నా కాళ్ళక్రిందనలిపివేయబడింది. అజ్ఞాన కాలంనాటి రక్తాలు కూడా రూపుమాప బడ్డాయి. ఇక మా రక్తాలలో నుంచి నేను తుడిచి వేస్తున్న మొదటి రక్తం రబీఅ బిన్‌ హారిస్‌ బిన్‌ అబ్దుల్‌ ముత్తలిబ్‌ గారి కుమారునిది. ఈ పసివాడు బనీ సఅద్‌లో పాలు త్రాగే సమయంలో హుజైల్‌ తెగకు చెందినవారు (కొందరు) అతనిని  చంపివేశారు. మరి అజ్ఞాన కాలంనాటి వడ్డీ కూడా తుడిచివేయబడింది. మా వడ్డీలలో నుం చి నేను తుడిచి వేస్తున్న మొదటి వడ్డీ అబ్బాస్‌ బిన్‌ అబ్దుల్‌ ముత్తలిబ్‌ గారిది. (బుఖారి)

హదీసులలో వడ్డీ ఖండన

హజ్రత్‌ అబూహురైర (ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ఏడు ప్రాణాంతక వస్తువుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోండి. అవి ఏమిటని ప్రశ్నించగా ఆయన (స) ఇలా తెలియజేశారు: 1.ఒక్కడైన అల్లాహ్‌కు  సహవర్తులుగా వేరొక దైవాన్ని నిలబెట్టడం. 2 . చేతబడి చేయడం, చేయించడం. 3. అన్యాయంగా హత్య చేయటం.  4. అనాధల సొమ్ము  అన్యాయంగా తినటం. 5. వడ్డీ తినటం. 6. ధర్మయుద్ధ సమయంలో యుద్ధరంగం నుండి వెన్నుచూపి పారిపోవటం. 7. పాపం ఎరుగని సౌశీల్యవతి అయిన మహిళపై అపనింద మోపడం.     (బుఖారి:2766, ముస్లిం:89)

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ హన్‌జల (ర) (ఈయన తండ్రి హన్‌జల బిన్‌ ఆమిర్‌ని ఉహద్‌ పోరాటo లో దైవదూతలు స్నానం చేయించారు) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచిం చారు: తెలిసి కూడా వడ్డీలోని ఒక్క దిర్‌హమ్‌ తిన్నవాడు 36సార్లు వ్యభిచారం చేసినదానికన్నా ఎక్కువ పాపం చేసినట్లు లెక్క.  (అహ్మద్‌,తబ్రాని)                                        దైవప్రవక్త (స) ప్రవచించారని హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (ర) ఉల్లేఖించారు:  వడ్డీలో డెబ్బయి మూడు స్థాయిలున్నాయి. వాటిలో అత్యంత హీనమైన స్థాయి యొక్క పాపం ఒక వ్యక్తి తన కన్న తల్లిని పెళ్ళాడటం వంటిది. వడ్డీ యొక్క అత్యంత తీవ్రస్థాయి పాపం ఒక ముస్లిం పరువు ప్రతిష్ఠలను మంట గలపటం. (హాకిం,బైహఖీ)                       హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర) కథనం: దైవప్రవక్త (స) వడ్డీ తీసుకునే వారినీ, ఇచ్చే వారి నీ, దీనికి సాక్షులుగా ఉండే వారినీ ధూత్కరించారు. ఆయన (స) ఇంకా ఇలా అన్నారు: ఈ పాపాన్ని మూట కట్టుకోవటంలో వీరంతా సమానులే.   (ముస్లిం )                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌(ర) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త(స) ఇలా తెలియజేసారు: ఏ ఊరిలోనైతే వ్యభిచారం మరియు వడ్డీ రివాజుగా మారిపోతుందో అక్కడి నివాసులు తమపైన దైవ శిక్షను హలాల్‌ చేసుకున్నట్లు.  (ముస్తద్‌రక్‌ లిల్‌ హాకిం)

వడ్డీ పెరగదు, తరుగుతుంది  

వడ్డీ పెరుగుతుందని భావించడం ఒక భ్రమ మాత్రమే. అల్లాహ్‌ మరియు దైవప్రవక్త (స) వ డ్డీ తరుగుతుందని అది నాశనానికి కారణమని తెలియజేశారు. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”అల్లాహ్‌ వడ్డీని హరింపజేస్తాడు, దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిస్టులను అల్లాహ్‌ సుతరామూ ప్రేమించడు. విశ్వసించి (సున్నత్‌ ప్రకారం) సత్కార్యాలు చేసే వారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్‌ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింత గానీ ఉండవు”. (అల్‌ బఖర:276-277)

 ”యమ్‌హఖుల్లాహుర్రిబా” అనే వాక్యానికి వివరణ ఇస్తూ హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) ఇలా అన్నారు: ముహిఖ్‌ అంటే తరగటం. అది ఎలా జరుగుతుందంటే అల్లాహ్‌ వడ్డీ తినేవాని హజ్‌, దానధర్మాలు, జిహాద్‌, బంధుత్వాలను పెంపొందించటం లాంటి పుణ్యా లు స్వీకరించడు. అనగా అతని ఏ ఒక్క పుణ్యం గాని స్వీకరించబడదు.  (తఫ్‌సీర్‌ ఖుర్‌తుబీ : 2/234)

అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌ఊద్‌ (ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స)ఇలా తెలియజేశారు: ఏ వ్యక్తి అయితే వడ్డీ ద్వారా ఎక్కువ ధనం సంపాదించాడో చివరకు దాని ఫలితం నశించటమే అవుతుంది. ( ఇబ్నెమాజ)    మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: వడ్డీ చూడటానికి ఎక్కువగా కనిపించినా చివరకు అది  నశిస్తుంది. (ముస్తద్‌రక్‌ హాకిం)

ప్రపంచాన్ని ప్రేమించే మనిషి వడ్డీతో ధనం పెరుగుతుందనీ, జకాత్‌తో ధనం తరుగుతుందనీ భావిస్తాడు. ఇది వాస్తవానికి విరుద్ధం. ఇలాoటి ధనపూజారుల మార్గదర్శకం కోసం వడ్డీకి బదులుగా అల్లాహ్‌ జకాత్‌ మరియు దాన ధర్మాలను పెట్టి వీటి ద్వారానే ధనం పెరుగుతుందని తెలియజేశాడు. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:   ”ప్రజల సొమ్ములలో చేరి వృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్‌ దృష్టిలో ఎంత మాత్రం వృద్ధి చెందదు. అయితే అల్లాహ్‌ ముఖాన్ని చూచేందుకు (ప్రసన్నతను చూరగొనేందుకు) మీరు జకాతు దానం ఇచ్చినట్లయితే -అలాంటివారే  (తమ సంపదలను) ఎన్నో రెట్లు వృద్ధిపరచుకున్న వారవుతారు. ( అర్‌ రూమ్‌:39)

వడ్డీ తినేవారి పరిస్థితి

ప్రళయ దినాన వడ్డీ తినేవారు ఒక ప్రత్యేక స్థితిలో ఉంటారు వీరు ప్రపంచంలో ఉన్నప్పుడు వడ్డీ తింటూ ఉండేవారని, చూసేవారు గ్రహిస్తారు. (ఇలాంటి వారి గురించి) అల్లాహ్‌ ఇలా తెలియజేశాడు: ”వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయినవాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం ”వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్‌ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధిం చాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్దనుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు.  అతని వ్యవహారం దైవాధీనం. ఇక మీదట  కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు.  వారు కలకాలం అందులో పడి ఉంటారు.   (అల్‌బఖర:275)                                                                                                       హజ్రత్‌ ఔఫ్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలాతెలియజేశారు: ”(పశ్చాత్తాపంతోతప్ప) క్షమించబడని పాపాలనుండి మీరు మిమ్మల్ని కాపాడుకోండి.(1)ఏదైనా విషయంలో ద్రోహం చేసిన వ్యక్తి అతను ద్రోహం చేసిన వస్తువుతో ప్రళయదినాన లేపబడతాడు. (2) వడ్డీ తినటం: వడ్డీ తినేవాడు ప్రళయ దినాన పిచ్చివాడిలా తూగుతూ లేపబడతాడు. తరువాత దైవప్రవక్త(స) ఈ వాక్యాన్ని పఠించారు: ”వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్లఉన్మాది అయిన వాని లాగానే నిలబడతాడు ( తర్‌గీబ్‌ వ తర్‌హీబ్‌)

వడ్డీ ఎంత తీవ్రమైన పాపమంటే ఇది సమాధిలో శిక్షకు కారణభూతమవుతుంది. ప్రళయ దినాన కూడా శిక్షకు గురి చేస్తుంది. హజ్రత్‌ సముర బిన్‌ జున్‌దుబ్‌(ర) దైవ ప్రవక్త(స) చెప్పారని ఇలా అన్నారు: ”రాత్రి నా వద్దకు ఇద్దరు దైవదూతలు (జిబ్రయీల్‌, మీకాయీల్‌) వచ్చారు, వీరు నన్ను ఎత్తుకుని ఒక పవిత్ర స్థలం వైపునకు తీసుకెళ్ళారు, అక్కడ దైవప్రవక్త(స) ఎన్నో విషయాలను చూశారు, వీటిలో ఒకటి ఒక రక్తపు నది కనిపించింది, అందులో ఒక మనిషి ఈదుతున్నాడు, నది ఒడ్డున ఒక మనిషి నిలుచుని ఉన్నాడు అతని దగ్గర ఎన్నో రాళ్ళున్నాయి, నదిలో ఉన్న వ్యక్తి బయటకు రావటానికి ప్రయత్నించినప్పుడు ఒడ్డున ఉన్న వ్యక్తి అతని ముఖం పై రాయి రువ్వుతున్నాడు, దాంతో అతను మళ్ళీ నది మధ్యలో వెళ్ళిపోతున్నాడు, ఈ విధంగా జరుగుతూనే ఉంది.ఇంతకీ ఏమిటి ఇది? అని నేను నా వెంట ఉన్న ఇద్దరిని ప్రశ్నించ గా ‘నదిలో చిక్కుకుపోయిన వ్యక్తి వడ్డీ సొమ్ము తినేవాడు. అందువల్ల తన కర్మకు శిక్ష  అనుభ విస్తున్నాడు, ఈ శిక్ష  ప్రళయం వరకూ అనుభవిస్తూనే ఉంటాడు అని వారు జవాబు చెప్పారు.”   ( బుఖారి)

Related Post